
కర్ణాటక రాష్ట్రంలోని అతి పెద్ద నగరమైన మైసూరు ప్యాలెస్ ఆవరణలో రెండు ఏనుగుల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మైసూరులో అత్యంత వైభవంగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఈ ఏనుగులను వినియోగిస్తుంటారు. ధనంజయ, కంజన్ అని పిలవబడే ఆ రెండు ఏనుగులు శుక్రవారం రాత్రి ఆహరం తింటుండగా స్వల్ప ఘర్షణకు దిగడంతో ఆందోళన నెలకొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధనంజయ ఏనుగు, కంజన్ ఏనుగుపై దాడికి పాల్పడుతూ వెంబడించింది. దాంతో ఆ సమయంలో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఏనుగుల సంరక్షణ చూసే మావటివాడు ఒక ఏనుగుపై ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆవేశంగా స్టీల్ బారికేడ్‌ని సైతం నెట్టేవేసి కోడి సోమేశ్వర ఆలయ ద్వారం నుంచి ప్రధాన రోడ్డు వైపు పరిగెత్తాయి. మైసూరు ప్యాలెస్‌లోని జయమార్తాండ గేటు వద్ద ఎగ్జిబిషన్ రోడ్డుగా పిలిచే మైసూరు-నంజన్‌గూడ్ రహదారిపైకి వెళ్లిపోయాయి. ఏనుగులు అలా ఉన్నఫలంగా బీభత్సం సృష్టించేసరికి రోడ్డుపై వెళ్తున్న ప్రజలకు ఏమీ అర్థం కాలేదు. తమని తాము రక్షించుకునేందుకు అడ్డదిడ్డంగా పరుగులు తీశారు. కొందరు ఆసక్తిగా చూస్తూ ఈ ఘటన దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించే ప్రయత్నం చేశారు.
ఎట్టకేలకు మావటి ఎంతో కష్టపడి ధనంజయ ఏనుగును శాంతింపజేయడంతో అది వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. మరో ఏనుగు కంజన్ కూడా చల్లబడ్డడంతో మావటి, అటవీ అధికారులు తిరిగి వాటిని శిబిరాలకు తరలించారు. మావటిలు తమ చురుకైన సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏనుగులను అదుపులోకి తేవడంతో పరిస్థితి చక్కబడింది. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు దశాబ్దాల్లో దసరా ఏనుగుల శిబిరంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. మరీ ముఖ్యంగా ఈ దసరా ఏనుగులు ప్రశాంతతకు మారుపేరుగా ప్రసిద్ధి చెందాయి. ఉత్సవాల సమయంలో చుట్టూ వేలాది మంది భక్తులు ఉన్నా కూడా ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..