భారతీయ జనతా పార్టీ(BJP)పై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మద్ధతు ఇవ్వలేదని, ఆ పార్టీలో చేరేందుకు నిరాకరించినందునే తనను గతంలో తీహార్ జైలుకు పంపారని ఆయన ఆరోపించారు. దీన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. గతంలో తీహార్ జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలంటూ బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన విమర్శలపై స్పందిస్తూ డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు తాను ఒప్పుకుని ఉంటే తాను తీహార్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.
మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు 2019 సెప్టెంబర్ 3న అరెస్టు చేసి.. తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు నెలన్నర రోజుల కారాగారవాసం తర్వాత అక్టోబర్ 23న ఆయన్ను తీహార్ జైలు నుంచి విడుదల చేశారు.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వంగా డీకే శివకుమార్ అభివర్ణించారు. ముడుపుల కోసం తమను మంత్రులు వేధిస్తున్నట్లు కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు కేటాయించేందుకు టెండర్ మొత్తంలో 30 శాతం ఇవ్వాలని, పెండింగ్ బిల్లుల విడుదలకు 5-6 శాతం కమిషన్లు మంత్రులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీకి జులై మాసంలో కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. మంత్రులపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలపై అధికారులతో విచారణకు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశించారు.
Also Read..
Viral Video: సింహంపై దాడికి నేను రెడీ.. వీడియోలో కుక్క ఫోజులు చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు..