జైపూర్, అక్టోబర్ 19: సీఎం పదవి కోసం రాజస్థాన్‌లో సచిన్ పైలట్, సీఎం గెహ్లాట్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తాను ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే ఆ పదవి మాత్రం నన్ను వీడేలా లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో గెహ్లాట్ మాట్లాడుతూ.. తాను నాలుగోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ఒక మహిళా కార్యకర్త తనను కోరినట్లు చెప్పారు. నేను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలనుకుంటున్నాను. కానీ ఈ పదవి నన్ను వదిలిపెట్టడం లేదని. అది వదల పోవచ్చుకూడా.. అంటూ ఈ సారి కూడా కాంగ్రెస్ గెలిస్తే సీఎం పీఠంపై తనదేనని పరోక్షంగా చెప్పారు. సీఎం గెహ్లాట్, పైలట్ మధ్య నడుస్తున్న అంతర్యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2020లో పైలట్ తిరుగుబాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాదాపుగా కూల్చివేసినంత పనైంది. అయితే అధిష్ఠానం కలుగజేసుకుని బుజ్జగించడంతో పైలట్ తన మనసు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడంతో కథ సుఖాంతం అయింది. అయితే నాటి నుంచి పైలట్-గెహ్లాట్ ఇరు వర్గాల మధ్య మాటల తుటాలు పేలుతూనే ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఇరువర్గాలు చెబుతున్నాయి. అందరూ కలిసే ఉన్నామని, ఎవరినీ వ్యతిరేకించడం లేదని ఆయన తెలిపారు. తనలోని ఏదో విశేషం ఉందని, అందుకే పార్టీ హైకమాండ్ తనను రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి మూడుసార్లు ఎంపిక చేసిందని సీఎం గెహ్లాట్ అన్నారు. హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయమైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో జాప్యంపై ఆయన స్పందిస్తూ.. ప్రతిపక్ష బీజేపీ మాత్రమే దానిపై చింతిస్తున్నదని అన్నారు. మేం పోట్లాడడం లేదు కాబట్టే వాళ్లు మనస్తాపానికి గురవుతున్నారు. పార్టీలో అందరి అభిప్రాయాలను పరిశీలించి అన్ని నిర్ణయాలూ తీసుకుంటాం. సచిన్ పైలట్ మద్దతుదారులతో కూడా మాట్లాడి వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నాం. అందుకే బీజేపీకి నిరాశగా ఉందని ఆయన అన్నారు.
తమ పార్టీ మంచి ప్రత్యామ్నాయాలు ఉంటే తప్పనిసరిగా సిట్టింగ్ శాసనసభ్యులను మార్చుతామన్నారు. పైలట్ వర్గం నుంచి టికెట్ ఆశించేవారి వారికి తప్పక అవకాశం కల్పిస్తామని ఎలాంటి మనస్పర్ధలు లేవని అన్నారు. తాను ‘క్షమించు – మరచిపో’ మంత్రాన్ని అనుసరిస్తున్నానని పైలట్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని గతంలో పైలట్ అన్నారు. కాగా ఈ ఏడాది నవంబర్ 25న రాజస్థాన్‌లో పోలీంగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెహ్లాట్-పైలట్ మధ్య విబేధాలు తొలగించడానికి కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ రెండు పార్టీలకు అంతర్గత పోరు సవాలుగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.