న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశ రాజధాని ఢిల్లీలోని లోధి రోడ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ లగ్జరీ కారు భీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న రెడ్ కలర్ ఆడీ కారు రోడ్డుపై వెళ్తున్న స్కూటీని ఢీకొట్టి.. అనంతరం ఆ పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ట్రామా సెంటర్‌కు తరలించారు. అనంతరం ఆడీ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాద స్థలంలో కొందరు వ్యక్తులు ప్రమాద దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో దృశ్యాలలో ఎరుపు రంగు ఆడి కారు నుజ్జునుజ్జు అయినట్లు కనిపిస్తోంది.
లోధి రోడ్డులోని జోర్ బాగ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆడీ కారు.. స్కూటీని ఢీ కొట్టినట్లు గురించి పోలీస్ స్టేషన్ లోధి కాలనీకి PCR కాల్ వచ్చిందని, తాము వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడటంతో వెంటనే ట్రామా సెంటర్‌కు తరలించామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం గాయపడిన బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉండని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. నిందితుడు కారు డ్రైవర్‌ను కూడా అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడిపై 281/125(a) BNS (279/337 IPC) సెక్షన్ కింద కేసు నమోదు చేసి, తదుపరి విచారణ జరుగుతోందని వెల్లడించారు.
VIDEO | Delhi: A speeding luxury car crashed into a tree in Lodhi Road area late last night. More details are awaited.#DelhiNews
(Full video available on PTI videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/yJMse3QjtK
— Press Trust of India (@PTI_News) February 18, 2025
మధ్యప్రదేశ్‌లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం భిండ్ జిల్లాలో డంపర్ ట్రక్కు వ్యాన్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. జవహర్‌పుర గ్రామ సమీపంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఒక వివాహ కార్యక్రమం నుంచి కొంతమంది వ్యక్తులు తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని భిండ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అసిత్ యాదవ్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.