Metro Station: ఢిల్లీలో కుప్పకూలిన మెట్రో స్టేషన్‌ గోడ.. ఒకరు మృతి..రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

|

Feb 08, 2024 | 5:57 PM

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పింక్ లైన్‌లో ఉన్న గోకుల్‌పురి మెట్రో స్టేషన్‌లో ఒక భాగం గురువారం (ఫిబ్రవరి 8) కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు తన స్కూటర్‌పై ఉండగా గోడ శిథిలాలు అతనిపై పడ్డాయి. దీంతో అతను తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సమీపంలోని కరవాల్ నగర్ ప్రాంతంలోని షహీద్ భగత్ సింగ్ కాలనీలో..

Metro Station: ఢిల్లీలో కుప్పకూలిన మెట్రో స్టేషన్‌ గోడ.. ఒకరు మృతి..రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Gokulpuri Metro Station Collapsed
Follow us on

ఢిల్లీ, ఫిబ్రవరి 8: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పింక్ లైన్‌లో ఉన్న గోకుల్‌పురి మెట్రో స్టేషన్‌లో ఒక భాగం గురువారం (ఫిబ్రవరి 8) కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు తన స్కూటర్‌పై ఉండగా గోడ శిథిలాలు అతనిపై పడ్డాయి. దీంతో అతను తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సమీపంలోని కరవాల్ నగర్ ప్రాంతంలోని షహీద్ భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటోన్న వినోద్ కుమార్‌ (53)గా గుర్తించారు. ఈ రోజు ఉదయం 11.10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పింక్ లైన్‌లో ఉన్న గోకుల్‌పురి మెట్రో స్టేషన్‌లో గోడ కూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు నాలుగు ఫైర్‌ టెండర్లను సంఘటనా స్థలానికి చేరవేసింది. శిథిలాల కింద చిక్కుకుకున్న వినోద్ కుమార్‌ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది రక్షించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన సమయంలో అతను తన స్కూటర్‌పై వెళ్తుండగా.. గోడ శిధిలాలు అతడిపై పడ్డాయని DCP (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. దాదాపు 40-50 మీటర్ల గోడతో పాటు స్లాబ్ కూలిపోయిందని ఆయన తెలిపారు. జేసీబీలు, క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నట్లు టిర్కీ తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిందని, ప్రస్తుతానికి మెట్రో స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు డీసీపీ టిర్కీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఆయన తెలిపారు. సివిల్ డిపార్ట్‌మెంట్‌లోని ఇద్దరు అధికారులు, మేనేజర్, జూనియర్ ఇంజనీర్‌ను తక్షణమే సస్పెండ్ చేశామని, వారిపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

భద్రతా జాగ్రత్తల దృష్ట్యా మౌజ్‌పూర్ నుండి శివ్ విహార్ వరకు ఉన్న చిన్న మార్గంలో రైలు సర్వీసులను సింగిల్ లైన్‌లో నడుపుతున్నట్లు ప్రకటించారు. అయితే మిగిలిన పింక్ లైన్‌లో సర్వీసులు యథావిధిగా నడుస్తునట్లు తెలిపారు. కాగా, గాయపడిన మిగతా నలుగురిని దిల్షాద్ గార్డెన్‌లోని జిటిబి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు, రెండు స్కూటర్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ.5 లక్షలు, మృతుడి బంధువులకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.