ఒకప్పుడు తమ పిల్లలకు పెళ్లి చేయాలంటే కుటుంబ నేపధ్యం.. మంచి చెడుల గురించి విచారించేవారు .. ముఖ్యంగా ఆడపిల్లను ఇచ్చే ఇంటికి సంబంధించిన వివరాల గురించి మరింత జాగ్రత్తగాతీసుకునేవారు. ఆస్తుల కంటే తమ ఆడపిల్ల అడగు పెట్టె ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించాలని భావించేవారు. అయితే కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా పెళ్లిళ్ల విషయంలో ఇచ్చే ప్రయారిటీల్లో కూడా మార్పులు వచ్చాయి. యువకులు అయితే తాము పెళ్లి చేసుకునే అమ్మాయి తెల్లగా అందంగా ఉండాలని.. బాగా చదువుకోవాలని మంచి జాబ్ చేస్తూ అంతకు మించి మంచి కట్న కానుకలు తీసుకుని రావాలని కోరుకుంటుంటే.. మేము మాత్రం తక్కువా అంటూ యువతులు కూడా తాము పెళ్లి చేసుకునే అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉండాలని.. మంచి ఉద్యోగం చెయ్యాలని జీతం లక్షల్లో ఉండాలని.. అతని తల్లిదండ్రులకు దూరంగా పట్టణాల్లో జీవించాలని .. వీలయితే విదేశాల్లో ఉండే అబ్బాయి అయితే బెస్ట్ అంటూ బోలెడంత లిస్ట్ చెప్పేస్తున్నారు టకాటకా.. దీంతో కొన్ని ప్రాంతాల్లోని యువకులను పెళ్లి కాకుండా ముదురు బెండకాయల్లా మిగిలిపోతున్నారు. తాజాగా తాము పెళ్లి చేసుకోవడానికి వధువులు కావాలని.. తమపై దైవం అనుగ్రహం కలగాలని కోరుతూ కర్ణాటకకు చెందిన బ్రహ్మచారి రైతులు సరికొత్త ప్లాన్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని మాండ్యానికి చెందిన పలువురు బ్రహ్మచారి రైతులు వచ్చే నెలలో పుణ్యక్షేత్రానికి పాదయాత్రతో వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. తమ పెళ్లికి సంబంధించిన సమస్యపై సమాజంలో అవగాహన కల్పించేందుకే పాదయాత్రను ప్లాన్ చేస్తున్నట్లు రైతులు తెలిపారు. గ్రామాల్లో నివసిస్తున్న రైతులకు తమ కూతురుని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. యువతులు కూడా వ్యవసాయం చేస్తున్న యువకులను పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిని చూపించడం లేదు. దీంతో పెళ్లి కాని బ్రహ్మచారులు ఎక్కువై పోతున్నారు. దీంతో
రైతులు “వధువు సంక్షోభాన్ని” ఎదుర్కొంటున్నారు.
ఇదే విషయంపై మాండ్యానికి చెందిన రైతులు మాట్లాడుతూ.. తాము వధువు తల్లిదండ్రులను కట్నం అడగడం లేదని పైగా తమ భార్యని (కాబోయే భార్యని) రాణుల మాదిరిగా చూసుకుంటామని చెబుతున్నారు. అయినప్పటికీ తమకు ఏ కుటుంబం కూడా తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా లేదంటూ చెప్పారు. ఈ సమస్యపై సమాజంలో అవగాహన కల్పించడానికి ఈ పాదయాత్ర చేపట్టామని చెప్పాడు ఒక రైతు.
డిసెంబరులో మాండ్యలోని బ్రహ్మచారి రైతులు అఖిల కర్ణాటక బ్రహ్మచారిగల సంఘం ఆధ్వర్యంలో ఆదిచుంచనగిరి మఠానికి పాదయాత్రగా వెళ్లాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఆదిచుంచనగిరి పీఠాధిపతి నిర్మలానందనాథ స్వామిని కలిశామని, యాత్రకు దర్శి సమ్మతిని తీసుకున్నామని చెప్పారు. వధువు సంక్షోభంపై సమాజంలో అవగాహన కల్పించడమే తమ లక్ష్యం అని సంఘ వ్యవస్థాపకుడు కెఎం శివప్రసాద్ తెలిపారు.
అయితే ఇదే తరహా యాత్రను 30 ఏళ్లు పైబడిన బ్రహ్మచారి యువకులు ఫిబ్రవరిలో ఆధ్యాత్మిక యాత్రను చేపట్టారు. దాదాపు వంద మంది పురుషులు చామరాజనగర్ జిల్లాలోని MM హిల్స్ ఆలయానికి వెళ్లారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..