Viral: అరుదైన ‘బాంబే బ్లడ్’ దానం చేసిన యువకుడు.. 50 లక్షల మందిలో ఒకరికే ఇలా

ఎవరికైతే బాంబే బ్లడ్ గ్రూప్ ఉంటుందో, వారిలో A, B, H ఎంటిజెన్ ఉండదు. అందుకే టెస్టులో కూడా ఎ, బి, ఎబి బ్లడ్ గ్రూప్ రాదు. అందుకే తమది 'ఓ' బ్లడ్ గ్రూప్ అని చాలా మంది అనుకుంటారు. కానీ దీనిని వివరంగా పరీక్షించాలంటే ఒక 'ఓ' సెల్ టెస్ట్ కూడా చేయాలి. రక్తం 'ఓ' బ్లడ్ గ్రూప్‌కు సంబంధించినది అయితే, ఆ టెస్ట్‌లో రియాక్షన్ రాదు. కానీ 'బాంబే' బ్లడ్ గ్రూప్‌లో యాంటీబాడీస్ ఉండడం వల్ల 'ఓ' సెల్‌తో కూడా రియాక్షన్ ఉంటుంది. దానితో అది 'బాంబే' గ్రూప్ అని తెలుస్తుంది.

Viral: అరుదైన బాంబే బ్లడ్ దానం చేసిన యువకుడు.. 50 లక్షల మందిలో ఒకరికే ఇలా
Bombay Blood Donation

Updated on: Feb 15, 2024 | 1:34 PM

కర్నాటకలోని విజయపూర్ జిల్లా యలగూరు గ్రామానికి చెందిన మహంతేష్ తుమ్మరమ్మటి అనే యువకుడు అరుదుగా లభించే “బాంబే బ్లడ్ గ్రూప్” ను దానం చేసి మానవత్వం చాటుకున్నాడు. బాగల్‌కోట్‌లోని విద్యాగిరికి చెందిన శిల్పా ముత్తగి (15 ఏళ్లు) హిమోగ్లోబిన్ లేకపోవడం, బలహీనత కారణంగా సోమవారం కుమారేశ్వర్‌ ఆస్పత్రిలో చేరింది. చికిత్స సమయంలో, ఆమె రక్తం తక్కువగా ఉందని డాక్టర్లు గుర్తించారు. ఆపై టెస్టు చేయగా ఆమెది.. అరుదైన “బాంబే బ్లడ్ గ్రూప్” అని వైద్య సిబ్బంది గుర్తించారు. అలాగే వెంటనే రక్తం అందించాలని లేకపోతే బతకడం కష్టమని డాక్టర్ చెప్పారు.

ఈ రక్తం చాలా అరుదైనది. అలానే డోనర్స్‌ను కనుగొనడం కష్టం. దీంతో ఆస్పత్రి సిబ్బంది కుమారేశ్వర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లోని బ్లడ్‌ గ్రూపు సభ్యుల జాబితాను పరిశీలించారు. అప్పుడు మహంతేష్ అనే వ్యక్తిది సేమ్ బ్లడ్ అని తెలిసింది. వెంటనే ఆసుపత్రి సిబ్బంది శిల్ప తల్లిదండ్రులకు సమాచారం అందించి మహంతేష్ ఫోన్ నంబర్ ఇచ్చారు. శిల్ప తల్లిదండ్రులు మహంతేష్‌కు ఫోన్‌ చేసి విషయం తెలియజేసి రక్తదానం చేయాల్సిందిగా కోరారు.

అయితే, మహంతేష్ కిరాయి వాహనం డ్రైవర్. బుధవారం (ఫిబ్రవరి 14) శ్రీశైలానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో బ్లడ్ ఇచ్చి.. తమ కుమార్తె ప్రాణం నిలబెట్టాలని పిలుపు వచ్చింది. వెంటనే మహంతేశ్‌ మరో డ్రైవర్‌ను అక్కడికి పిలిపించి శ్రీశైలం వాహనాన్ని పంపించాడు. తర్వాత మహంతేష్ బస్సు ఎక్కి బాగల్‌కోట్‌కు వచ్చి కుమారేశ్వర్ హాస్పిటల్‌లోని రక్తదాన కేంద్రంలో రక్తదానం చేశారు. మహంతేశ్‌ కృషిని అందరూ ప్రశంసించారు.

50 లక్షల మందిలో ఒకరి బ్లడ్ గ్రూప్

శరీరంలో హెచ్ యాంటిజెన్ లేని వ్యక్తుల రక్తాన్ని బాంబే బ్లడ్ గ్రూప్ అంటారు. “బాంబే బ్లడ్ గ్రూప్” అనేది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్. 50 లక్షల మందిలో ఒకరికి ఈ రకం ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూపు ఉన్న వారి జీవితం పూర్తిగా మామూలుగా ఉంటుంది. వారికి శారీరకంగా ఎలాంటి సమస్యలూ ఉండవు. మీరు ‘బాంబే’ బ్లడ్ గ్రూపు వారు అయితే సెంట్రల్ బ్లడ్ రిజిస్ట్రీలో మీ పేరు నమోదు చేసుకోండి. అలా చేయడం వల్ల అవసరమైనప్పుడు మీకు సాయం లభిస్తుంది. మీరు కూడా వేరేవారికి హెల్ప్ చేయవచ్చు. మీతోపాటు, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా టెస్ట్ చేయించండి. ఎందుకంటే ఇది వంశపారంపర్యం అయితే వారికి కూడా బాంబే బ్లడ్ గ్రూపు ఉండచ్చు. ‘క్రయో ప్రిజర్వేషన్’ అనే ఒక టెక్నిక్ ద్వారా ఈ రక్తాన్ని ఒక ఏడాదిపాటు సురక్షితంగా ఉంచవచ్చని డాక్టర్లు తెలిపారు. అన్ని బ్లడ్ గ్రూపులు ఇంగ్లిష్ అల్ఫాబెట్స్ ఎ, బి, ఓ లాంటి పేర్లతో ఉంటాయి. కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఒక సిటీ పేరుతో ఉంది. దీని రీజన్… మొట్టమొదట దీనిని మహారాష్ట్ర రాజధాని బాంబేలో గుర్తించారు. వైఎం భెండె 1952లో ఈ గ్రూప్ రక్తం కనుగొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..