BJP: తొలి జాబితాలో కనిపించని ఫిలిబిత్‌ సెగ్మెంట్‌.. వరుణ్‌గాంధీ రాజకీయంపై అనేక ఊహాగానాలు

|

Mar 03, 2024 | 12:57 PM

వరుణ్‌గాంధీకి టికెట్‌ ప్రకటించకపోవడానికి ఆయనపై బీజేపీ పెద్దలకు ఉన్న అసంతృప్తే కారణమని చెబుతున్నారు. రైతుల ఉద్యమం, లఖింపూర్‌ ఖేరిలో రేప్‌-హత్య ఘటన తర్వాత బీజేపీ తీరును ఆయన విమర్శించడం ఆ పార్టీ అగ్రనేతలకు నచ్చలేదు. ఆ తర్వాతి కాలంలో తన వైఖరిని వరుణ్‌గాంధీ మార్చుకున్నారు.

BJP: తొలి జాబితాలో కనిపించని ఫిలిబిత్‌ సెగ్మెంట్‌.. వరుణ్‌గాంధీ రాజకీయంపై అనేక ఊహాగానాలు
Varun Gandhi
Follow us on

ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్ అని బీజేపీ నినాదాలు హోరెత్తిన వేళ, రాజకీయంగా ముఖ్యమైన ఉత్తరప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫిలిబిత్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న వరుణ్‌గాంధీ పేరు బీజేపీ తొలి జాబితాలో కనిపించలేదు. ఇదే ఇప్పుడు యూపీ పాలిటిక్స్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. ఫిలిబిత్‌లో కొత్త అభ్యర్థిని దించడానికి బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వరుణ్‌గాంధీ తీసుకోబోయే నిర్ణయం ఏంటన్నది ఆసక్తిగా మారింది.

ఫిలిబిత్‌ నుంచి వరుణ్‌గాంధీ పేరుని బీజేపీ ప్రకటించకపోతే, ప్లాన్‌-B మీద చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ వరుణ్‌గాంధీని చేర్చుకోవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే, ఈ యువ నాయకుడిని అమేథీ నుంచి దించాలని కూడా ప్రయత్నాలు సాగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్‌గాంధీని, స్మృతి ఇరానీ ఓడించారు. ఈసారి అమేథీ నుంచి రాహుల్‌గాంధీకి బదులు వరుణ్‌గాంధీని బరిలోకి దించవచ్చన్నది యూపీ పాలిటిక్స్‌లో సాగుతున్న చర్చ. అదే జరిగితే రాజకీయంగా సంచలనం అవుతుంది. అయితే తాను అమేథీ నుంచి పోటీచేయడం లేదని వరుణ్‌ చెప్పినప్పటికీ, నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చని కొందరు అంటున్నారు.

వరుణ్‌గాంధీకి టికెట్‌ ప్రకటించకపోవడానికి ఆయనపై బీజేపీ పెద్దలకు ఉన్న అసంతృప్తే కారణమని చెబుతున్నారు. రైతుల ఉద్యమం, లఖింపూర్‌ ఖేరిలో రేప్‌-హత్య ఘటన తర్వాత బీజేపీ తీరును ఆయన విమర్శించడం ఆ పార్టీ అగ్రనేతలకు నచ్చలేదు. ఆ తర్వాతి కాలంలో తన వైఖరిని వరుణ్‌గాంధీ మార్చుకున్నారు.

పనితీరు, విజయావకాశాల ఆధారంగా బీజేపీ అధిష్ఠానం 195మందితో తొలిజాబితాను ప్రకటించింది. 80 ఎంపీ సీట్లున్న యూపీలో 51 సీట్లకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అయితే వరుణ్‌గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫిలిబిత్‌ పేరు ఫస్ట్‌ లిస్ట్‌లో లేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఫిలిబిత్‌లో వరుణ్‌గాంధీ బీజపీ టికెట్‌పై గెలిచారు. అంతకుముందు 1989, 1996, 1998, 1999, 2004 ఎన్నికల్లో వరుణ్‌గాంధీ తల్లి మేనకాగాంధీ ఇక్కడినుంచే విజయం సాధించారు. ఈ పరిస్థితుల్లో తర్వాతి జాబితాలో వరుణ్‌గాంధీ పేరును బీజేపీ ప్రకటిస్తుందా? లేక ఆయన ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటుందా అన్నది యూపీ రాజకీయంగా చర్చనీయాంశం అయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..