Uttarakhand: ఉత్తరాఖండ్‌లో రికార్డ్ స్థాయిలో వర్షాలు.. 47 మంది మృతి.. తాజా పరిస్థితిపై ఆరాతీసిన ప్రధాని మోడీ

Uttarakhand Floods: ప్రకృతి ప్రకోపానికి దేవభూమి ఉత్తరాఖండ్‌ వణుకుతుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెగని వర్షాలతో రాష్ట్రంలో బీభత్సం..

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో రికార్డ్ స్థాయిలో వర్షాలు.. 47 మంది మృతి.. తాజా పరిస్థితిపై ఆరాతీసిన ప్రధాని మోడీ
Uttarakhand Floods
Follow us

|

Updated on: Oct 20, 2021 | 12:35 PM

Uttarakhand Floods: ప్రకృతి ప్రకోపానికి దేవభూమి ఉత్తరాఖండ్‌ వణుకుతుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెగని వర్షాలతో రాష్ట్రంలో బీభత్సం నెలకొంది. గత 24 గంటల్లో ముక్తేశ్వర్‌లో 340.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 107 సంవత్సరాల క్రితం18-09-1914 లో కురిసిన 254.5 మి.మీ వర్షపాతం ఇప్పటివరకూ రికార్డుగా ఉంది. అయితే తాజాగా మూడు రోజుల నుంచి కురుస్తున్న అతిభారీ వర్షాలతో ఆ రికార్డ్ బద్దలైంది. మరోవైపు వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. గత 24 గంటల్లో పంత్‌నగర్‌లో 403.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడంతో.. 31ఏళ్ల కిందట నమోదైన భారీ వర్షపాతం రికార్డు కూడా బద్దలైంది.. 1990 జూలై 10న పంత్‌నగర్‌లో 228 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంతేకాదు చంపావత్‌, నైనిటాల్‌, జియోలికోట్, భీమ్‌టాల్, హల్ద్వానీ, రామ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసి ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ.. ఉహించిన దాటికంటే.. అతిభారీ వర్షాలు కురిశాయి. దీనికి కారణం రుతుపవనాల్లో చోటు చేసుకున్న మార్పుల కారణం అని వాతావరణ శాఖ చెబుతుంది. రాష్ట్రంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 47 మంది మృతి చెందారు. నిన్న రోజులోనే 42 మంది దుర్మరణం పాలయ్యారు. ఒక్క నైనిటాల్ లోనే అధికంగా 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వర్షాలు, వరదలతో నైనిటాల్ జిల్లా అతలాకుతలమవుతోంది. ఇంటర్నెట్ సేవలకూ అంతరాయం ఏర్పడింది. నైనీ సరస్సు ఒడ్డున ఉన్న నైనా దేవి ఆలయం, మాల్‌ రోడ్డును వరదలు ముంచెత్తాయి. కోసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది, అనేక చోట్ల యాత్రికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

పౌరి జిల్లాలో రాళ్లు, మట్టి దిబ్బలు పడటంతో ముగ్గురు మృతి చెందారు. చంపావట్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పలు ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయి. వంతెనలు కూలి పోయాయి. ముందుజాగ్రత్త చర్యగా బద్రీనాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. సురక్షిత ప్రాంతంలో ఉండాలని సూచించారు. వర్షాలు తగ్గే వరకు యాత్ర కొనసాగించవద్దని సూచించారు.

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ దామి ఏరియల్ సర్వే నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 4 లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి లక్షా 90 వేల చొప్పున సాయం అందిస్తామని సిఎం చెప్పారు. పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఉత్తఖండ్ పరిస్థితిపై సీఎం పుష్కర్ సింగ్ దామికి ప్రధాని మోడీ ఫోన్ చేసి ఆరా తీశారు. కేంద్రం అండగా ఉంటుందన్నారు.

Also Read:  పవర్ ఆఫ్ యునైటెడ్ ఫ్యామిలీ.. వరద ఉధృతి నుంచి గున్న ఏనుగు ఎలా బయటపడిందో చూడండి..