ఫిర్యాదు చేయడమే పాపం.. మహిళను కొట్టి, గుండు చేయించిన కుటుంబసభ్యులు..!
ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేయడమే పాపమైంది. ఓ మహిళను అందరూ చూస్తుండగానే చావబాది, శిరో ముండనం చేయించారు.
ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేయడమే పాపమైంది. ఓ మహిళను అందరూ చూస్తుండగానే చావబాది, శిరో ముండనం చేయించారు. ఈ దారుణ ఘటన కన్నౌజ్‌లో వెలుగు చూసింది. తన మేనల్లుడు లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను దారుణంగా కొట్టి, తలకు గుండు చేయించారు కుటుంబసభ్యులు. పైగా వీడియో తీసి సోషల్ మీడియోలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళ భర్తతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు.
ఈ సంఘటన సెప్టెంబర్ 3న జరిగింది. అయితే ఈ వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఫుటేజీలో చేతులు, కాళ్లు కట్టి ఉన్న మహిళను కర్రతో పదే పదే కొట్టారు. ఆపై దుర్బాషలాడుతూ హింసించారు. కుటుంబసభ్యులు అందరు కలిసి ఆమెకు గుండు గీయించారు. తన మేనల్లుడు రాజనాథ్ తనను కొంత కాలంగా వేధిస్తున్నాడని ఆ మహిళ పేర్కొంది. ఆమె ఫిర్యాదు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా, ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు ఆమెపై దాడికి దిగారు. తల క్షౌరము చేసి, కర్రలతో కొట్టారు.
ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. మహిళను కొట్టిన వ్యక్తి ఆమె భర్తగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అతనితోపాటు ఆరుగురిని అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కనౌజ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..