కాన్పూర్, అక్టోబర్ 2: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వింత దొంగతనం వెలుగు చూసింది. జిల్లాలోని కలెక్టర్‌గంజ్‌లో ఉన్న జైన దేవాలయంలో సేవాకార్యక్రమాలు నిర్వహించే ఓ సేవకుడు ఇద్దరు సహచరుల సాయంతో దేవుడి విగ్రహానికి అలంకరించిన ఏడున్నర కిలోల వెండి ఆభరణాలను అపహరించాడు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఘటనకు పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, చోరీకి గురైన లక్షల రూపాయల విలువైన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు బృందానికి ఈస్ట్ డీసీపీ రివార్డు ప్రకటించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కలెక్టర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని సిర్కి మొహల్‌లోని జైన శ్వేతాంబర్ ఆలయంలో సెప్టెంబర్ 29న ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చోరీ ఘటనపై ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆలయంలో దేవుడి విగ్రహానికి అలంకరించిన దాదాపు రూ.6 లక్షల విలువైన వెండి ఆభరణాలు, కలశాన్ని దొంగలు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు గుడిలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దీనిలో భాగంగా పోలీసులు దాదాపు 70 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత దొంగలను గుర్తించారు.
నిందితులను గోరఖ్‌పూర్ జిల్లా సిక్రిగంజ్ ఇందిరాపార్ నివాసి దులారే ధోబి అలియాస్ శ్యాము, అసోజీ బజార్‌కు చెందిన దిలీప్ కుమార్, మహొయికి చెందిన రాంవృక్ష్ వర్మలుగా పోలీసులు గుర్తించారు. నిఘానేత్రాల సహాయంతో పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్టు చేశారు. ఝకర్కటి బస్టాండ్‌లో నిందితులు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన ఏడున్నర కిలోల వెండి ఆభరణాలు, పాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆలయంలో జరిగిన చోరీలో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. గత 12 ఏళ్లుగా ఆలయంలో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోన్న దులారే ధోబి అలియాస్ శ్యామూ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా తేలింది. చోరీ ఘటనలో ఆలయ సేవకుడే ప్రధాన నిందితుడని, అతని సహచరులతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు ఏసీపీ నిశాంక్ శర్మ తెలిపారు. నిందితుడు శ్యాము దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఉండేవాడు. జైన శ్వేతాంబర్ ఆలయంలో జరిగిన చోరీ ఘటనను 50 గంటల్లో ఛేదించిన పోలీసు బృందానికి ప్రభుత్వం రివార్డు అందజేసి సత్కరించింది. ఈ ఘటనను బయటపెట్టిన బృందానికి రూ.25,000 రివార్డు ఇచ్చినట్లు తూర్పు డీసీపీ శివాజీ శుక్లా మీడియాకు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.