
నేటి ఆధునిక ప్రపంచంలో ఇంధన సంక్షోభం, పెరుగుతున్న కాలుష్యం మానవాళికి పెద్ద సవాళ్లుగా మారాయి. ఈ తీవ్రమైన సమస్యలపై సమాజంలో అవగాహన కల్పించేందుకు లక్నో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు ఒక అద్భుతమైన, వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేవలం తీర్పులు చెప్పడమే కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం ఆచరణలోనూ తాము ముందుంటామని వారు నిరూపించారు.
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల వల్ల వచ్చే వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో లక్నో హైకోర్టుకు చెందిన 50 మందికి పైగా న్యాయమూర్తులు, న్యాయాధికారులు శుక్రవారం (మే 22, 2026) తమ లగ్జరీ కార్లను పక్కనబెట్టి, సైకిళ్లపై కోర్టుకు తరలివచ్చారు. ఉదయం లక్నోలోని దాలిబాగ్‌లో ఉన్న సెషన్స్ హౌస్ వద్ద వీరంతా సమావేశమయ్యారు. లక్నో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్ ఈ ప్రత్యేక సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి మల్ఖాన్ సింగ్ నివాసం వద్ద కూడా పెద్ద సంఖ్యలో న్యాయాధికారులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కోర్టు దుస్తుల్లో న్యాయమూర్తులు రోడ్లపై సైకిళ్లు తొక్కుతూ వెళ్తుంటే చూసిన స్థానిక ప్రజలు ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం కేవలం ఒక రోజుకు పరిమితమైన చొరవ మాత్రమే కాదని, ఈ ప్రచారాన్ని కొనసాగించడానికి న్యాయమూర్తులు ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్య సమస్య దృష్ట్యా, పర్యావరణాన్ని పరిరక్షించడానికి సమాజంలోని ప్రతి వర్గం ఇప్పుడు ముందుకు రావాలని న్యాయవ్యవస్థ భావిస్తోంది. దీని ముఖ్య ఉద్ధేశ్యం పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించి, భవిష్యత్ తరాలకు ఇంధనాన్ని ఆదా చేయడం, మోటారు వాహనాల వినియోగం తగ్గించడం ద్వారా నగరాల్లో వాయు, శబ్ద కాలుష్యాన్ని అదుపు చేయడం, నిత్య జీవితంలో సైకిల్ తొక్కడం వల్ల శారీరక శ్రమ పెరిగి, ఆరోగ్యం మెరుగుపడుతుందని చాటిచెప్పడం, మన అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చో ప్రజలకు ప్రాక్టికల్‌గా చూపించడం కోసమే ఈ ర్యాలీ నిర్వహించినట్లు న్యాయమూర్తులు తెలిపారు. “ఇది కేవలం ఒక రోజుకు పరిమిత కార్యక్రమం కాదు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్రచారాన్ని నిరంతరం కొనసాగిస్తాం.” అని న్యాయాధికారుల ప్రతిజ్ఞ చేశారు.
న్యాయవ్యవస్థ తీసుకున్న ఈ నిర్ణయం నగరం అంతటా చర్చనీయాంశంగా మారింది. సమాజంలోని ప్రతి వర్గం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమం గుర్తుచేసింది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారే సైకిళ్లపై ప్రయాణిస్తుంటే, సామాన్య ప్రజలలో కూడా సైకిల్ వాడకంపై ఉన్న అనాలోచిత సంకోచాలు తొలగిపోతాయి. దేశవ్యాప్తంగా ఇంధన ధరల భారం పెరుగుతున్న తరుణంలో, న్యాయమూర్తులు చూపిన ఈ బాట సామాన్యులకు స్ఫూర్తిదాయకం. ఈ వినూత్న చొరవ కేవలం లక్నోకే పరిమితం కాకుండా, దేశంలోని అన్ని నగరాల ప్రజల్లో పర్యావరణంపై సరికొత్త చైతన్యాన్ని రగిలిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..