రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక కీలక పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాఖలైన ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఈ కేసుకు సంబంధించిన 'పేపర్ బుక్' (పిటిషన్ రికార్డులను) సీల్ చేసి భద్రపరచాలని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక కీలక పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాఖలైన ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఈ కేసుకు సంబంధించిన ‘పేపర్ బుక్’ (పిటిషన్ రికార్డులను) సీల్ చేసి భద్రపరచాలని స్పష్టం చేసింది.
జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్, జస్టిస్ జాఫర్ అహ్మద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులను ఇచ్చింది. పిటిషన్‌లోని సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ రికార్డులను సీనియర్ రిజిస్ట్రార్ సురక్షిత సంరక్షణలో ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ సమయంలో ధర్మాసనం కార్యదర్శి సమక్షంలోనే వీటిని అన్‌సీల్ చేయాలని కోర్టు పేర్కొంది. రికార్డుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రాహుల్ గాంధీ తోపాటు ఆయన కుటుంబ సభ్యులు తమకు తెలిసిన ఆదాయ వనరుల కంటే అత్యధికంగా ఆస్తులు కలిగి ఉన్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత సమగ్ర విచారణ జరిపించాలని, అలాగే ఒక సాధారణ కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ కేసులో సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఆదాయపు పన్ను శాఖ (IT), కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO)లను కూడా ప్రతివాదులుగా చేర్చారు.
ఈ కేసులో ప్రాథమిక వాదనలను విన్న అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం, తదుపరి విచారణను మే 12వ తేదీన మధ్యాహ్నం 2:15 గంటలకు షెడ్యూల్ చేసింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు కోర్టు రికార్డులను భద్రపరచాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రాహుల్ గాంధీపై వచ్చిన ఈ ఆస్తుల ఆరోపణల పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యున్నత దర్యాప్తు సంస్థలను ఇందులో భాగస్వాములను చేయాలని కోరడం, కోర్టు రికార్డులను సీల్ చేయాలని ఆదేశించడం వంటి పరిణామాలు మే 12న జరగబోయే విచారణపై ఉత్కంఠను పెంచుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
