బీజేపీ రెండు నాల్కల ధోరణి.. కమల్ నాథ్ ఫైర్
తమ కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ఆరోపించారు. ఓ వైపు మా ఈ ఎమ్మెల్యేలను బందీలుగా నిర్బంధంలో ఉంచారు.
తమ కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ఆరోపించారు. ఓ వైపు మా ఈ ఎమ్మెల్యేలను బందీలుగా నిర్బంధంలో ఉంచారు.. మరోవైపు శాసన సభలో బల పరీక్ష జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. బెంగుళూరులో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ బందీలుగా చేసిందని, వారు విడుదలయ్యేలా చూడాలంటూ ఆయన హోం మంత్రి అమిత్ షాకు నాలుగు పేజీల లేఖ రాశారు. ఇందుకోసం మీ అధికారాన్ని ఉపయోగించండి అని కోరారు. వీరు విడుదలయితే ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్భయంగా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన వీరంతా రాజీనామాలు చేయడంతో మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. వీరిని రిలీజ్ చేస్తే తమ ప్రభుత్వం వీరికి అత్యంత భద్రత కల్పిస్తుందని కమల్ నాథ్ అన్నారు. శాసన సభలో బల పరీక్ష జరిగేలా చూడాలని బీజేపీ ప్రతినిధిబృందమొకటి గవర్నర్ ను కలిసి అభ్యర్థించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కాగా-సోమవారం సభలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని గవర్నర్ లాల్ జీ టాండన్ అసెంబ్లీ స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని ఆదేశించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయడంగానీ, జాప్యం చేయడం గానీ జరగరాదన్నారు. దీంతో ఇక కమల్ నాథ్ ప్రభుత్వ భవితవ్యం సోమవారం తేలనుంది.