చైనాకు పరోక్ష హెచ్చరిక….భారత్ తో నౌకా విన్యాసాలకు అమెరికా రెడీ !
అమెరికాకు చెందిన అతి పెద్ద యుధ్ధ నౌక.. 'యుఎస్ఎస్ నిమిట్జ్' ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో నిలిచిఉంది. మలేసియా-ఇండోనేసియా మధ్య.... మలక్కా జలసంధిలో దీన్ని అమెరికా మోహరించింది. ఇండియాతో కలిసి యుఎస్ నిర్వహించనున్న..

అమెరికాకు చెందిన అతి పెద్ద యుధ్ధ నౌక.. ‘యుఎస్ఎస్ నిమిట్జ్’ ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో నిలిచిఉంది. మలేసియా-ఇండోనేసియా మధ్య…. మలక్కా జలసంధిలో దీన్ని అమెరికా మోహరించింది. ఇండియాతో కలిసి యుఎస్ నిర్వహించనున్న నౌకా విన్యాసాల్లో ‘నిమిట్జ్’ ప్రధాన పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. గత జూన్ లో జపనీస్ నేవల్ దళాలతో కలిసి భారత్ నిర్వహించిన నౌకా విన్యాసాల మాదిరే ఇవి కూడా ఉండవచ్చునని భావిస్తున్నారు. అమెరికా వారి ఈ నౌక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా. విశాలమైన దీని రన్ వే వంటి భాగం నుంచి విమానాలను స్టార్ట్ చేయవచ్ఛు.
లదాఖ్ తూర్పు ప్రాంతంలో గత నెలలో భారత-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలోనూ, చైనా కవ్వింత చర్యల పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న దృష్ట్యాను.. ఆ దేశానికి గట్టి గుణపాఠం చెప్పాలని అమెరికా భావిస్తోంది. తన నౌకాదళ సత్తా చాటాలని తహతహలాడుతోంది. సౌత్ చైనా సీ లోని యుఎస్ఎస్ ‘థియోడార్ రూజ్ వెల్ట్’ నౌకతో కలిసి నిమిట్జ్.. సంయుక్తంగా ‘ఫిలిప్పీన్ సముద్రం’లో క్యారియర్ ఆపరేషన్స్ ని నిర్వహించింది.
ఇండో-పసిఫిక్ లో తమ నౌకాదళ పోరాట సత్తా చూపడానికి, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే దేశాలను (ప్రధానంగా చైనా) ఎదుర్కోవడానికి భారత దేశంతో కలిసి తాము చేసే విన్యాసాలు తోడ్పడతాయని అమెరికా భావిస్తోంది. హిందూ మహాసముద్రంలో చైనా నౌకల సంఖ్య పెరుగుతుండడంతో.. అమెరికా పరోక్షంగా చైనాకు చేస్తున్న ఈ హెచ్ఛరిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.