Donald Trump 2.0: ట్రంప్ పునరాగమనం భారత్‌కు లాభమా.. నష్టమా?
డొనాల్డ్ ట్రంప్ - నరేంద్ర మోదీ మధ్య మంచి స్నేహ బంధం ఉండడం, గత ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మోదీ ప్రచారం కూడా చేయడంతో.. దేశంలోని మోదీ అభిమానులు ట్రంప్ అనుకూల వైఖరిని వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ గతంలో అనుసరించిన విధానాలు, ఇప్పుడు ప్రకటిస్తున్న విధానాలు ఏవీ కూడా భారతదేశానికి అంత అనుకూలం కాదని స్పష్టమవుతోంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం, అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. పెన్సిల్వేనియాలో ఓ ఎన్నికల ప్రచార సభలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం తర్వాత ఆయన గెలుపు సునాయాసమే అన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల్లోనే గట్టి పోటీ ఇచ్చి, తృటిలో పరాజయం పాలైన ట్రంప్.. ఈ హత్యాయత్నం ఘటనతో సంబంధం లేకుండానే గెలుస్తారన్న ప్రచారం సాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లోనూ ట్రంప్‌పై దాడి ఘటన గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఐటీ ఎగుమతుల నుంచి, టెక్నాలజీ రంగ నిపుణుల వలసల వరకు ఆ దేశంపై ఆధారపడుతున్న భారతదేశానికి.. ట్రంప్ ఆగమనం లాభమా.. నష్టమా అన్నదే ఇప్పుడు భారతీయులందరి ముందు ఉన్న ప్రశ్న. ఇదే సమయంలో ఆయన తన పార్టీ నుంచి ఉపాధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు వాన్స్‌ను బరిలోకి దింపడం మరింత ఆసక్తికరంగా మారింది.
డొనాల్డ్ ట్రంప్ – నరేంద్ర మోదీ మధ్య మంచి స్నేహ బంధం ఉండడం, గత ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మోదీ ప్రచారం కూడా చేయడంతో.. దేశంలోని మోదీ అభిమానులు ట్రంప్ అనుకూల వైఖరిని వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ గతంలో అనుసరించిన విధానాలు, ఇప్పుడు ప్రకటిస్తున్న విధానాలు ఏవీ కూడా భారతదేశానికి అంత అనుకూలం కాదని స్పష్టమవుతోంది. ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడు కావొచ్చన్న అంచనాలతో భారత్ తమ విదేశీ దౌత్య వ్యూహాలపై దృష్టిసారించింది. సంపన్న, పేద దేశాలు, వర్తమాన దేశాలన్నీ ఇప్పుడు ఇదే అంశంపై దృష్టిసారించాయి. కొన్ని దేశాల అధిపతులు ఇప్పటికే ట్రంప్ టీమ్‌తో తెరచాటు సంప్రదింపులు కూడా మొదలుపెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది.
వాణిజ్యం అంత సులభం కాదు
ముందుగా ఆర్థిక-వాణిజ్య విధానాలను ఓసారి పరిశీలిస్తే.. ‘ట్రంప్ సిగ్నేచర్ పాలసీ’ల్లో ఒకటి అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపై 10% సుంకం విధించడం. తద్వారా ఆయన అమెరికా దిగుమతులను కట్టడి చేసి, దిగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించాలని చూస్తున్నారు. అంటే యూఎస్ ఆర్థిక వ్యవస్థ చుట్టూ రక్షణ వలయాన్ని సృష్టించడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, అమెరికాకు 120 బిలియన్ డాలర్ల విలువైన వస్తు-సేవలను ఎగుమతి చేస్తున్న భారతదేశానికి ఇది ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. భారతీయ ఎగుమతులు ట్రంప్ పన్నులు – సుంకాల కారణంగా దెబ్బతింటాయి. భారత్-యుఎస్ వాణిజ్యాన్ని నెమ్మదించేలా చేస్తాయి. మరోవైపు ట్రంప్ ఆర్థిక సలహాదారుల అభిప్రాయం ప్రకారం భారత ఆర్థిక విధానాలు అత్యంత రక్షణపూరితం. ఒకవేళ ట్రంప్ అగ్రరాజ్యాధినేతగా తిరిగొస్తే.. ఆ విధానాలను యూఎస్ కోసం సడలించాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. ట్రంప్ ఆర్థిక విధానాలు గతంలోనే భారతదేశానికి ఇబ్బందులు సృష్టించాయి. అమెరికాకు కొన్ని దేశాలు ప్రత్యేక పథకం కింద కొన్ని వస్తువులను ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీ (దిగుమతి సుంకం) లేకుండా ఎగుమతి చేసే అవకాశం ఉండేది. అయితే 2019లో ట్రంప్ ఈ జాబితా నుంచి భారతదేశాన్ని తొలగించారు. భారతదేశం తన వ్యవసాయ, పాడి పరిశ్రమ విభాగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నియంత్రించడం ట్రంప్‌కు నచ్చలేదు. అందుకే ఆయన ఇలా చేశారని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషించారు.
పర్యావరణం.. ప్రతికూలం
ప్రపంచంలో పర్యావరణానికి హాని కలిగించకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు విచ్చలవిడిగా శిలాజ ఇంధనాలను వాడేసి, వాతావరణంలో కర్బన ఉద్గారాలను, పారిశ్రామిక వ్యర్థాలను యదేచ్ఛగా వదిలేసి, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు నీతులు చెబుతున్నాయి. ఈ కారణంగా పెరిగిన భూతాపం, తద్వారా వాతావరణ మార్పులు సృష్టిస్తున్న బీభత్సాలను ప్రతి దేశం ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది. ఈ క్రమంలో భారతదేశం సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణం విషయంలో ధనిక దేశాలు ఆర్థికంగా, సాంకేతిక పరిజ్ఞానం పరంగా సహకరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే భూతాపం పెరగడం వల్ల తలెత్తుతున్న వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల అత్యధికంగా ప్రభావితం అవుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. అయితే ట్రంప్ ఈ డిమాండ్‌ను దోపిడీగా చూస్తున్నారు. తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పునరుత్పాదక ఇంధన వనరులను ఏర్పాటు చేసుకునే విషయంలో ఆర్థిక సహాయం, టెక్నాలజీ సహాయం చేయడానికి ఆయనకు ఇష్టం లేదు. చైనా, భారత్ వంటి వంటి దేశాలకు అమెరికా నిధులు అందించడం తనకు ఆసక్తి లేదని ట్రంప్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే అంశం.
అయితే బొగ్గు, ముడి చమురు వంటి శిలాజ ఇంధనాల అన్వేషణకు ట్రంప్ మద్దతు తెలుపుతున్నారు. భారతదేశం తన అవసరాలకు తగిన స్థాయిలో పునరుత్పాదక ఇంధన వనరులను ఏర్పాటు చేసుకునే వరకు, శిలాజ ఇంధనాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఇలా మొత్తంగా వాతావరణ మార్పులపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, భారతదేశం – ట్రంప్ ఈ విషయంలో కలిసి పని చేసే అవకాశం ఉంది.
ఆసియా మిత్రులపై ట్రంప్ వైఖరి ఇలా…
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వస్తే ఆసియాలోని అమెరికా మిత్ర దేశాలకు సహకరించకపోవచ్చు. ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో చైనా దురాక్రమణ ముప్పును ఎదుర్కొంటున్న తైవాన్‌ను అమెరికా అండగా ఉంటుందని చెప్పలేదు. ఆసియాలో చైనా సైనిక ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా వైఖరి ఇక్కడ చాలా ముఖ్యం. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక వ్యవస్థ కల్గిన దేశంగా అమెరికానే ఉంది. చైనాను నిలువరించే క్రమంలో ఆసియాలోని మిత్రదేశాలకు యూఎస్ సహకారం అనివార్యం. చైనాను ఎదుర్కొనేందుకు భారతదేశం అమెరికాతో కలిసి పనిచేయడానికి ఇది ఒక కారణం. అయితే దక్షిణ కొరియా, జపాన్ వంటి మిత్రదేశాలు అమెరికా కారణంగా అనుచిత లబ్ది పొందుతున్నాయని ట్రంప్ అభిప్రాయం. అంటే ఈ దేశాలకు అమెరికా నుంచి సహాయం అందడమే తప్ప, అదే స్థాయిలో అమెరికా లబ్ది పొందడం లేదని, ఇది ఇచ్చిపుచ్చుకున్నట్టుగా లేదని భావిస్తున్నారు. ఆసియా ప్రాంతంలో ఉన్న అమెరికన్ బలగాల సంఖ్యను ట్రంప్ తగ్గించే అవకాశం ఉంది. ఇది భారతదేశానికి కూడా ఆందోళన కల్గించే అంశమే అవుతుంది.
అగ్రరాజ్యంలో అంతర్గత పరిస్థితుల ప్రభావం..
ట్రంప్ 2.0 పాలన అమెరికాలో దేశీయ ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉంది. తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వ సంస్థలను ప్రయోగిస్తానంటూ ట్రంప్ పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు. కక్షసాధింపు రాజకీయాలు ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి. అలాగే ఈ తరహా పరిస్థితులు ఆ దేశాల విదేశాంగ విధానంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అంతమాత్రాన ట్రంప్ 2.0 పాలనలో భారత్-అమెరికా సంబంధాలు తెగిపోతాయని చెప్పడం లేదు. చైనాను ఎదుర్కొనే క్రమంలో అమెరికా సహకారం కొనసాగుతుంది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తుంది. అలాగే రష్యాపై ట్రంప్ కఠిన వైఖరి ఉండదు. తద్వారా రష్యాతో భారత్ సాగిస్తున్న స్నేహంపై పశ్చిమ దేశాల అభ్యంతరాలు తగ్గుతాయి. ఫలితంగా రష్యాతో భారత్ సత్సంబంధాలు అలాగే కొనసాగించుకోవచ్చు. వాతావరణ మార్పులు, వాణిజ్యం విషయంలో ట్రంప్‌తో భారత్ గతంలో విబేధించాల్సి వచ్చింది. అయినా సరే.. ట్రంప్ 1.0 హయాంలో భారత్-అమెరికా సంబంధాలు చక్కగా ముందుకు సాగాయి. ట్రంప్ 2.0 హయాంలో కూడా అదే రకమైన వాతావరణం కొనసాగవచ్చు. లేదా ఊహించని పరిణామాలు కూడా ఎదురుకావొచ్చు. ఏదేమైనా.. ట్రంప్ పునరాగమనంతో భారతదేశానికి మంచి జరగాలని ఆశిద్దాం.
భారత్-రష్యా-అమెరికా సంబంధాలు..
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడం భారత్-రష్యా సంబంధాలపై తప్పనిసరిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల అనంతరం అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే భారత్ మాత్రం మునుపటిలానే రష్యాతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. ఓ రకంగా రష్యా నుంచి తక్కువ ధరకు ఇంధనం కొనుగోలు చూస్తూ స్వలాభం చూసుకుంది భారత్. అయితే భారత్ వైఖరి పట్ల చాలా అగ్ర దేశాలతో పాటు అమెరికా అసంతృప్తితో ఉన్నా.. ఏమీ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు ట్రంప్ 2.O లో పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యేందుకు రష్యా సాయపడిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే.. రష్యాతో చెడిన సంబంధాలను పునరుద్ధరించేందుకు చొరవ చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గతంలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌తో డొనాల్డ్ ట్రంప్ రెండుసార్లు చర్చలు జరిపారు. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైతే నార్త్ కొరియా విషయంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతుందన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది.
ఉపాధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి తెలుగింటి అల్లుడు వాన్స్
ఇక తాజాగా ఉపాధ్యక్ష రేసులో జె.డి.వాన్స్‌ను ఖరారు చేశారు ట్రంప్. నిజానికి వాన్స్ భార్య ఉష చిలుకూరి తెలుగు మూలాలున్న వ్యక్తి. ఉష తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. యేల్ విశ్వ విద్యాలయం నుంచి ఉష హిస్టరీలో డిగ్రీ పొందారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ నుంచి తత్వ శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయసంబంధ విభాగాల్లో ఎక్కువ కాలం పని చేశారు. పుట్టి పెరిగిందంతా కాలిఫోర్నియాలో శాండియాగో ప్రాంతం. యేల్ లా స్కూల్లో ఉష-వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో హిందూ సంప్రదాయంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవడం విశేషం. వీరికి ముగ్గురు పిల్లలు. రాజకీయంగా అనేక విషయాల్లో భర్తకు అను నిత్యం తోడుగా ఉంటూ వచ్చారు ఉష.
అమెరికాలోని అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, విస్కాన్‌సిన్ రాష్ట్రాల్లో భారతీయ ఓటర్లు దాదాపు 13 లక్షల మంది ఉన్నారు. వీరే అధ్యక్ష ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న రెండు పార్టీల్లోనూ భారతీయ మూలాలున్న వ్యక్తులు ప్రధాన పదవులకు పోటీ చేస్తుండటం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం TV9 News App డౌన్‌లోడ్ చేసుకోండి