జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, లోక్ సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంపై లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులు పెద్దఎత్తున ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇది చట్ట విరుధ్దమని, ఆయనను వెంటనే విడుదల చేస్తే సభకు హాజరవుతారని వారన్నారు. జీరో అవర్ లో ఈ సమస్యను లేవనెత్తిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి.. ఫరూక్ 106 రోజులుగా నిర్బంధంలో ఉన్నారని, ఆయనను రిలీజ్ చేస్తే సభకు హాజరవుతారని అన్నారు. ఆ హక్కు ఆయనకు ఉందన్నారు. కాశ్మీర్ ను సందర్శించేందుకు యూరోపియన్ యూనియన్ ఎంపీలను అనుమతిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీని కూడా అనుమతించలేదని, పలువురు ఎంపీలను శ్రీనగర్ నుంచి తిప్పి పంపేశారని ఆయన పేర్కొన్నారు. డీఎంకె నేత టీ. ఆర్. బాలు కూడా…. ఫరూక్ అబ్దుల్లా సభకు హాజరయ్యేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఫరూక్ నిర్బంధం చట్టవిరుధ్ధమని, ఈ సభకు ‘ కస్టోడియన్ ‘ అయిన మీరు ఆయన విడుదలయ్యేలా చూడాలని అన్నారు. అసలు ‘ బిర్లా ‘ జోక్యం చేసుకోవాలని సెటైర్ వేశారు. పీడీపీ నేత, కాశ్మీర్ మరో మాజీ సీఎం మెహబూబా ముప్తీని కూడా నిర్బంధించారు.. తన తల్లిపై దాడి జరిగిందని ఆమె కుమార్తె ఆరోపించారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా అని బాలు ప్రశ్నించారు. సభ్యుల ఆందోళనతో కొద్దిసేపు సభలో ఉద్రిక్తత నెలకొంది.