Crime News: భోజనానికి పిలిచి ప్రాణ స్నేహితుడి హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

భోజనానికని నమ్మకంగా పిలిచి స్నేహితుడిని కడతేర్చారు ఈ కిరాతకులు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలొ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యువకుడిని అతని స్నేహితులు డిన్నర్‌కని తమతోపాటు తీసుకెళ్లారు. ఐతే అప్పటి నుంచి..

Crime News: భోజనానికి పిలిచి ప్రాణ స్నేహితుడి హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?
Up Murder Case
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 09, 2022 | 12:58 PM

Utter Pradesh crime news: భోజనానికని నమ్మకంగా పిలిచి స్నేహితుడిని కడతేర్చారు ఈ కిరాతకులు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలొ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యువకుడిని అతని స్నేహితులు డిన్నర్‌కని తమతోపాటు తీసుకెళ్లారు. ఐతే అప్పటి నుంచి సదరు ఉపాధ్యాయుడు కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అనుమానంతో ఉపాధ్యాయుడి ఇద్దరు స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ధర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హర్దోయ్‌లోని అత్రౌలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పిప్రి నారాయణ్‌పూర్‌కు చెందిన సర్వేష్‌ ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితులైన దినేష్‌, సురేంద్రతో కలిసి గత బుధవారం (ఆగస్టు 3న) వీర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఈట్‌ మల్‌ లక్నో దావత్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో సర్వేష్‌ కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. సర్వేష్ స్నేహితులను కూడా ప్రశ్నించగా వారు తమకు తెలియదని బుకాయించారు. దీంతో దినేష్‌, సురేంద్రల వ్యవహారంపై అనుమానం కలిగిన సర్వేష్‌ తండ్రి సత్తిదిన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సర్వేష్ కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం కొనసాగించారు. ఈ క్రమంలో వీర్‌పూర్‌కు 3 కిలోమీటర్ల దూరంలోనున్న రాయ్‌పూర్‌లోని మామిడి తోటలో 30 అడుగుల లోతైన ఎండిన బావిలో సర్వేష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అత్రౌలీ, మాల్ పోలీస్ స్టేషన్ల పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఎండిన బావిలోని మృతదేహాన్ని తాడు సహాయంతో బయటకు తీశారు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఇవి కూడా చదవండి

ఆరు రోజుల క్రితం తమ బిడ్డను అతని స్నేహితులు దినేష్‌, సురేంద్ర భోజనానికి పిలిచి కిడ్నాప్‌ చేసి, పథకం ప్రకారం హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో ఇద్దరు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్యకు గల కారణాలు తెలుస్తాయని, ఆధారాలు సేకరించేపనిలో ఉన్నట్లు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్దోయ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ మీడియాకు తెలిపారు.