Rahul Gandhi: దేశంలో రికార్డు స్థాయికి నిరుద్యోగం.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్..

|

May 24, 2022 | 7:04 AM

దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరిందని రాహుల్‌గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. 45 కోట్ల మంది ఉద్యోగాలపై ఆశలు వదులుకున్నారంటూ రాహుల్ ఆవేదన వ్యక్తంచేశారు.

Rahul Gandhi: దేశంలో రికార్డు స్థాయికి నిరుద్యోగం.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్..
Rahul Gandhi
Follow us on

Rahul Gandhi on Central Govt: కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. దేశంలో 45 కోట్ల మంది యువత ఉద్యోగాలపై ఆశలు వదులుకున్నారని ఫేస్‌బుక్‌ వేదికగా రాహుల్‌గాంధీ.. మోడీ సర్కార్‌పై విమర్శలు చేశారు. దేశంలో నిరుద్యోగం (Unemployment) రికార్డు స్థాయికి చేరినప్పటికి ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణాల్లో మాత్రమే కాకుండా గ్రామాల్లో కూడా నిరుద్యోగం పెరగడంతో ప్రజలు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం యుపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. దీంతో 100 రోజులు కనీస పనిదినాలు కల్పించి గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకున్నట్టు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాజస్థాన్‌ ప్రభుత్వం తాజాగా ఇందిరాగాంధీ అర్బన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ స్కీమును ప్రారంభించిందని అన్నారు. ఈ పథకంలో పట్టణ ప్రాంతానికి చెందిన పేదలకు కనీసం 100 రోజుల పని దొరుకుతుందన్నారు. కాంగ్రెస్‌ అధికారం లోకి వస్తే ఇందిరాగాంధీ అర్బన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ స్కీమును దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్‌గాంధీ.

ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ప్రకటించారు రాహుల్‌గాంధీ. 2005లో ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పధకం దేశవ్యాప్తంగా సక్సెస్‌ అయ్యిందన్నారు రాహుల్‌గాంధీ. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం కారణంగా అప్పట్లో నిరుద్యోగం చాలా అదుపు లోకి వచ్చిందన్నారు. ఈ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రం తగినన్ని నిధులు విడుదల చేయడం లేదన్నారు రాహుల్‌గాంధీ. అధిక ధరలను నియంత్రించడంలో కూడా కేంద్రం ఘోరంగా విఫలమయ్యిందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని రాహుల్‌గాంధీ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..