పాములంటే అందరికీ హడలే.. అలాంటి పాము ఎదురుగా వస్తే ఏమవుతుంది.. అల్లంత దూరంలో పామును చూడగానే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీస్తారు చాలా మంది. కానీ, కొందరు మాత్రం పాము కనబడగానే వారిలో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తుంది. ఎక్కడ పాము కనిపించిన సరే.. చట్టుకుని పట్టుకుని బుట్టలో వేసుకుంటారు. చాలా ప్రాంతాల్లో స్నేక్ క్యాచర్స్ ప్రత్యేకించి పాములను పట్టుకోవటమే వృత్తిగా కొనసాగుతుంటారు. అయితే, ఈ పాముల్లో చాలా రకాలు కనిపిస్తుంటాయి. కొన్నిపాముల విషం ప్రమాదం కానప్పటికీ అలాంటి వాటిని చూస్తే భయపడక తప్పదు. ఇంకొన్ని పాములు అత్యంత విషపూరితమైనవిగా ఉంటాయి. మరికొన్ని పాములు అత్యంత అరుదైనవి కూడా కనిపిస్తుంటాయి. అలాంటి ఓ అరుదైన పాము ఒకటి దొరికింది ఉడిపిలోని అటవీ శాఖ అధికారులకు.
ఉడిపిలోని పర్కాల మార్కెట్ సమీపంలో అరుదైన, మనోహరమైన ఎగిరే పాము లభ్యమైంది. ఇక్కడి మున్సిపల్ కౌన్సిల్‌కు చెందిన భవనంలోని లాండ్రీ ముందు ఉన్న చెట్టుపై నుంచి పాము అకస్మాత్తుగా కిందకు దూకి అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు రెండున్నర అడుగుల పొడవు, శరీరంపై నలుపు, తెలుపు చారల మధ్య ఎర్రటి పగడపు రంగుతో, చెట్టుపై నుంచి కిందకు దూకుతున్న పామును చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. పామును పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు.. ఇది విషం లేని పాము అని తేల్చి చెప్పారు. క్రిసోపెలియా ఓర్నాట దీని శాస్త్రీయ నామంగా తెలిపారు. దీనిని ఎగిరే పాము అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా కొండ ప్రాంతాలలో కనిపిస్తుంది. , ఈ పాములు తీరప్రాంతంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..