Union Budget: బడ్జెట్‌ను సమర్పించే అవకాశం దక్కని ఆర్థిక మంత్రులు ఎవరో తెలుసా?

బడ్జెట్ 2025కోసం సగటు భారతీయుడు ఒళ్లంతా కాయలు చేసుకుని వెయిట్ చేస్తున్నారు. ఈసారైనా తమ గోడు కేంద్రం పట్టించుకుంటుందని.. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ నిర్మలమైన మనస్సుతో తమ కష్టాలను ఆలకిస్తుందని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. వరుసగా 8వసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత చరిత్రలో ఇద్దరు ఆర్థిక మంత్రులకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశమే దక్కలేదు.

Union Budget: బడ్జెట్‌ను సమర్పించే అవకాశం దక్కని ఆర్థిక మంత్రులు ఎవరో తెలుసా?
Kc Niyogi , Hn Bahuguna

Edited By: Basha Shek

Updated on: Jan 31, 2025 | 10:26 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు అంటే శనివారం (1 ఫిబ్రవరి 2025) వరుసగా 8వసారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించి రికార్డు సృష్టించబోతున్నారు. సాధారణ బడ్జెట్‌లో బలహీనపడుతున్న ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందించేందుకు, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత చరిత్రలో ఇద్దరు ఆర్థిక మంత్రులకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశమే దక్కలేదు.

క్షితిజ్ చంద్ర నియోగి

స్వతంత్ర భారతదేశ చరిత్రలో, క్షితిజ్ చంద్ర నియోగి (కెసి నియోగి), హేమవతి నందన్ బహుగుణ (హెచ్‌ఎన్ బహుగుణ) ఆర్థిక మంత్రులుగా ఉన్నప్పటికీ జాతీయ బడ్జెట్‌ను సమర్పించలేకపోయారు. 1949 సంవత్సరం అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో కెసి నియోగి తాత్కాలిక ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అతను సుప్రసిద్ధ ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్‌గా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా కేసీ నియోగి పదవీ కాలం కేవలం 35 రోజులు మాత్రమే కావడంతో బడ్జెట్‌ను సమర్పించలేకపోయారు. అయినప్పటికీ, అతను ఆర్థిక విధానాలలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి, స్వతంత్ర భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను అందించడానికి కృషి చేశారు.

హేమవతి నందన్ బహుగుణ

కెసి నియోగి తర్వాత, జాన్ మథాయ్ 1950లో ఆర్థిక మంత్రిగా స్వతంత్ర భారతదేశం మొదటి బడ్జెట్‌ను సమర్పించారు. మరో ఆర్థిక మంత్రి హెచ్.ఎన్. బహుగుణ కూడా భారతదేశ బడ్జెట్‌ను సమర్పించలేకపోయారు. 1979లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన కొంతకాలం తర్వాత రాజకీయ గందరగోళం కారణంగా రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం కూడా ఐదున్నర నెలలు మాత్రమే. ఈ క్రమంలోనే బహుగుణకు జాతీయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం దక్కలేదు.

నిర్మలా సీతారామన్ 2019లో భారతదేశానికి మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా, స్వతంత్ర భారతదేశంలో మొదటి సాధారణ బడ్జెట్‌ను నవంబర్ 26, 1947 న దేశ మొదటి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి సమర్పించారు. మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, మొరార్జీ దేశాయ్ ఆ తరువాత లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ఆర్థిక మంత్రిగా మొత్తం 10 బడ్జెట్‌లను సమర్పించారు.

సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం ఎవరిది..?

నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2020న రెండు గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. 1977లో హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం 800 పదాలను మాత్రమే కలిగి ఉన్న అతి చిన్న ప్రసంగం. గతంలో ఫిబ్రవరి చివరి రోజు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించడం ఆనవాయితీ. 1999 సంవత్సరంలో దీని సమయం మారింది. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సింగ్ ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పించారు. అప్పటి నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. దీని తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో 2017లో బడ్జెట్‌ను సమర్పించే తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. తద్వారా ప్రభుత్వం మార్చి చివరి నాటికి పార్లమెంటు ఆమోద ప్రక్రియను పూర్తి చేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..