రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాల్లో ఆరితేరిన పీకే (ప్రశాంత్ కిశోర్) పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (Trinamool Congress) ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. తన రాజకీయ చతురతతో మమతా బెనర్జీ (Mamata Banerjee) ని వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టారు. ఇక పీకే పనితీరుకు ముగ్ధురాలైన దీదీ వచ్చే ఎన్నికల వరకూ ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పనిచేసేందుకు అవగాహన కుదుర్చుకుంది. అయితే పీకే స్థాపించిన ఐ-పాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) సంస్థ వ్యవహారాలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ప్రజలకు జవాబుదారీగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు ఓ కాంట్రాక్టర్ చేతిలో నడవడమేంటని తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (kalyan Banerjee) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ఓ రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ మాదిరిగానే నడవాలి. అంతేకానీ ఓ కాంట్రాక్టర్ చేతిలో కీలు బొమ్మ కాకూడదు. నేను ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో నన్ను సంప్రదించకుండానే మునిసిపల్ కార్పొరేషన్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకాన్ని ఐ-పాక్ బృందం చేపట్టింది. దీనిపై ప్రజలకు నేను వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఐ-పాక్ మా జీవితాలను దీన స్థితిలోకి జారుస్తోంది’ అంటూ టీఎంసీ ఎంపీ పీకేపై మండిపడ్డారు.
కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన గోవాలోనూ పీకే బృందం తీరుపట్ల ఆ రాష్ట్ర తృణమూల్ చీఫ్ కిరణ్ కండోల్కర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. త్వరలోనే ఆయన పార్టీని వీడతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ‘ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఐ-పాక్ బృందం కారణంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి గురించి పార్టీ నేతలతో చర్చించినప్పుడు, అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని వారందరూ నాకు సలహా ఇచ్చారు. దీనిపై ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేను. కానీ, ప్రశాంత్ కిశోర్‌తోపాటు ఆయన బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాం’ అని కిరణ్ పేర్కొన్నారు. కాగా గోవాలో ఫిబ్రవరి 14నపోలింగ్ పూర్తికాగా మార్చి 10 ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read:TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం… వినియోగించుకోండి
Covid: బిల్ గేట్స్ ల్యాబ్‌లోనే కరోనా పుట్టింది.. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ సంచలన ప్రకటన..
Summer Diet: కాలం మారుతోంది.. ఆహారంలో ఈ మార్పులు తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే..