Train Moves In Reverse: సాంకేతిక లోపంతో ఓ రైలు రివర్స్‌లో వెళ్లింది. అది కూడా దాదాపు 35 కిలోమీటర్లు.. దీంతో ఆ రైలులో ఉన్నవారంతా ఏం జరుగుతుందోనంటూ భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని తానక్‌పూర్‌కు వెళ్లే పూర్ణగిరి జనశతాబ్డి ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో 35 కిలోమీటర్ల వరకు వెనుక్కి వెళ్లింది. చివరకు ఢిల్లీ నుంచి 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖతిమా వద్ద నిలిచి పోయింది. బుధవారం పూర్ణగిరి జనశతాబ్డి ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి తనక్‌పూర్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో హఠాత్తుగా ట్రాక్‌పైకి పశువు రావడంతో దానిని తప్పించేందుకు లోకో పైలట్ సడెన్ బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది. అయితే పశువును ఢికొట్టిన తరువాత రైలు ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో లోకోపైలట్ రైలుపై నియంత్రణను కోల్పోవడంతో వెనక్కి ప్రయాణించింది. దీనికి సంబంధించి వెంటనే లోకో పైలెట్ అధికారులకు సమాచారమిచ్చాడు.
దీంతో తనక్‌పూర్ నుంచి ఖాతిమా వరకు అన్ని రైల్వే క్రాసింగ్‌లు మూసివేశారు. చివరకు చకర్‌పూర్ – ఖతిమా మధ్యనున్న గేట్ నంబర్ 35 వద్ద మట్టి, కంకరను అడ్డుపెట్టి రైలును ఆపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో రైలులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని, వారంతా క్షేమంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఖతిమా నుంచి ప్రయాణికులను తనక్‌పూర్‌కు బస్సులో తరలించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న యూపీలోని ఫిలిబిత్ నుంచి టెక్నికల్ బృందం అక్కడకు చేరుకుని విచారణ ప్రారంభించింది.
ఈ ఘటన అనంతరం రైల్వే అధికారులు ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. దీంతోపాటు ముగ్గురు సభ్యులతో కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: