THIRD FRONT: జాతీయ రాజకీయాల్లో తృతీయం సాధ్యమా ? ఫెయిల్యూర్ ఫార్ములాని తెరమీదికి తెస్తే ఎవరికి ప్రయోజనం? సార్వత్రికానికి ‘థర్డ్’ స్ట్రోక్

జాతీయ స్థాయిలో ఎవరు ప్రత్యామ్నాయం అన్న చర్చ మొదలైంది. బీజేపీకి ధీటుగా ఎదిగే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అలాంటప్పుడు దేశంలో బలమైన థర్డ్ ఫ్రంట్ తీసుకురావాల్సిన అవసరం వుందని మమతాబెనర్జీ, కేసీఆర్ లాంటి నేతలు భావిస్తున్నారు. అయితే...

THIRD FRONT: జాతీయ రాజకీయాల్లో తృతీయం సాధ్యమా ? ఫెయిల్యూర్ ఫార్ములాని తెరమీదికి తెస్తే ఎవరికి ప్రయోజనం? సార్వత్రికానికి ‘థర్డ్’ స్ట్రోక్
Mamata, Kejriwal, Kcr, Stalin, Uddav
Follow us
Rajesh Sharma

| Edited By: Anil kumar poka

Updated on: Apr 15, 2022 | 6:46 PM

THIRD FRONT EFFECT ON GENERAL ELECTIONS POSSIBILITIES FAILURE FORMULA: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం వుంది. జమిలి దిశగా వేగంగా అడుగులు పడితే తప్ప 2024 మార్చి, ఏప్రిల్ లోపు దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగే పరిస్థితి లేదు. ముఖ్యంగా పార్లమెంటులో తిరుగులేని సంఖ్యాబలంతో భారతీయ జనతా పార్టీ తాను అనుకున్నప్పుడు ఎన్నికల దిశగా అడుగులు వేసే అవకాశం వుంది. ఈలోగా గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యాబలం కోణంలో చూస్తే చాలా పటిష్టంగా కనిపిస్తున్నా భారతీయ జనతా పార్టీ ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ అంతిమంగా కేంద్రంలోను మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహరచన చేస్తోంది. ఆ పార్టీకి ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఒక్క పంజాబ్ మినహా మిగిలిన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలను బీజేపీ కైవసం చేసుకున్నది. మరీ ముఖ్యంగా యుపీ లాంటి కీలక రాష్ట్రంలో హిస్టారిక్ విక్టరీ కమలం పార్టీలో దూకుడు పెంచిందనే చెప్పాలి. యుపీలో 80వ దశకం తర్వాత ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. అలాంటి రికార్డును క్రియేట్ చేస్తూ.. యోగీ ఆదిత్య నాథ్ సారథ్యంలో అక్కడ వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది బీజేపీ. ఆ తర్వాత గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు.. తెలంగాణలో పాగా వేసేందుకు సిద్దమైంది కమలం పార్టీ.

రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు ఎలా వున్నా.. బీజేపీ అంతిమ లక్ష్యం వచ్చే సార్వత్రిక ఎన్నికలే. కానీ బీజేపీ కలలను భగ్నం చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం కంటే ఎక్కువగా పలు ప్రాంతీయ పార్టీలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నాయి. 2014 దాకా కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ (యుపీఏ సారథిగా) ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోను అంతగా ప్రభావం చూపలేపోయింది. కీలక రాష్ట్రాల్లో హీన స్థితికి చేరింది. సంఖ్యాబలంలో కుదేలైపోయింది. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇటు అధికార బీజేపీ అందుకు భిన్నంగా కనిపిస్తోంది. జాతీయవాదం, మేక్ ఇన్ ఇండియా, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, ఆత్మ నిర్బర్ భారత్ వంటి నినాదాలతో బీజేపీ యువతను ప్రభావితం చేస్తోంది. అవినీతిరహిత పాలనగా ప్రచారం చేసుకుంటోంది. వీలైనపుడల్లా గత కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో వెలుగు చూసిన స్కాములను ఎత్తి చూపుతోంది. దేశభక్తిని పెంచేలా కొందరు స్వాతంత్ర పోరాట యోధులను హైలైట్ చేస్తోంది. కొన్ని ఉదంతాలను హైలైట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకోలేదని భావిస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీని గద్దె దింపేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. మరో దఫా కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇక తమ పని గల్లంతేనని కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇందులో బెంగాలీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వున్నారు. మరికొందరు సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధినేతలు కూడా బీజేపీకి ప్రత్యామ్నాయం కావాలని ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ఎవరు ప్రత్యామ్నాయం అన్న చర్చ మొదలైంది. బీజేపీకి ధీటుగా ఎదిగే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అలాంటప్పుడు దేశంలో బలమైన థర్డ్ ఫ్రంట్ తీసుకురావాల్సిన అవసరం వుందని మమతాబెనర్జీ, కేసీఆర్ లాంటి నేతలు భావిస్తున్నారు. అయితే… బీజేపీని గద్దె దింపే విషయంలో వీరి అభిప్రాయంతో ఏకీభవించే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు మూడో కూటమి గురించి మాట్లాడడం లేదు. గత వారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలో 9 రోజులున్నా.. కేజ్రీవాల్, కేసీఆర్‌ల భేటీ జరగలేదు. అదేసమయంలో ఢిల్లీ పర్యటనకు వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత స్టాలిన్‌తో కేజ్రీవాల్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖాముఖి భేటీ కూడా అయ్యారు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన అంశం చెప్పుకోవాలి. దేశానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వారిలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ప్రాంతీయ పార్టీ నేత లేరు. చిరకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలే. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రధానులు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఇంద్ర కుమార్ గుజ్రాల్ కూడా జాతీయ పార్టీలైన జనతా పార్టీ, జనతా దళ్‌లకు చెందిన వారే. ఈ క్రమంలో ఓ ప్రాంతీయ పార్టీ నేతను భవిష్యత్తులో ప్రధానిగా చూడడం అంత సులభం కాదనే విశ్లేషణలే ఎక్కువగా వున్నాయి.

బీజేపీని దేశం నుంచి తరిమి కొడతామంటూ భీషణ ప్రతిఙ్ఞలు చేస్తున్న కేసీఆర్, మమతా బెనర్జీలు ప్రత్యామ్నాయ కూటమి విషయంలో ఏ మేరకు ఏకాభిప్రాయం సాధిస్తారో తెలియదు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన పరిణామం గురించి చెప్పుకోవాలి. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనమేంటి ? భారత దేశం రాష్ట్రాల సమాఖ్యనే కదా అని ప్రశ్నిస్తున్న కొందరు ప్రాంతీయ పార్టీల అధినేతలు ఢిల్లీ పీఠం దిశగా అడుగులు వేస్తున్నారనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలే అయితే.. ఢిల్లీలో పాగా వేసే లక్ష్యంతో దేశ రాజధానిలో తమ తమ పార్టీలకు ఢిల్లీలో కార్యాలయం వుండాలని తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఢిల్లీలో శరవేగంగా నిర్మాణమవుతోంది. టీఎంసీ, డీఎంకే పార్టీలు కూడా ఢిల్లీలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీ, శివసేన పార్టీలు ఆల్ రెడీ ఢిల్లీలో ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఈ పార్టీల్లో ఎన్సీపీ మినహా అన్ని పార్టీలు ఒకే రాష్ట్రానికి పరిమితం కానీ.. అడపా దడపా వేరే రాష్ట్రాల్లోను పోటీ చేస్తూ జాతీయ పార్టీలమని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల నేతల స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతలుగా మారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని పైన పేర్కొన్న రాజకీయ పార్టీల అధినేతలు చూస్తున్నారు. అయితే.. ఇదంత సులభమా అంటే ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తాయి. నిజానికి కేసీఆర్ వంటి నేతలు ప్రవచించే మమతాబెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్, నవీన్ పట్నాయక్ వంటి పేర్లు దూరం నుంచి చూస్తే ప్రత్యర్థికి ప్రత్యర్థి తమకు మిత్రుడు అనే రీతిలో కనిపిస్తారు. కానీ వారి వారి పొలిటికల్ ఫ్రెండ్షిప్స్‌ని కాస్త దగ్గరగా చూస్తే వీరంతా బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవ్వడం సాధ్యమేనా అన్న సందేహం కలుగక మానదు.

వీరిలో ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్ వంటి వారు కాంగ్రెస్ పార్టీకిపుడు మిత్రులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కావడంతో జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటైతే కాంగ్రెస్ పట్ల ఇటు కేసీఆర్, అటు థాక్రే వంటి నేతలు అవలంభించే విధానాలు వేరువేరుగా వుంటాయి. అదేసమయంలో బెంగాల్‌లో బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా చూసే మమతా బెనర్జీ.. కాంగ్రెస్ పార్టీ తమపై ఆధిపత్యం చెలాయించనంత కాలం ఆ పార్టీకి సన్నిహితంగా వుండే అవకాశాలున్నాయి. వీరందరితో పోలిస్తే కేజ్రీవాల్ పార్టీది మరో భిన్నమైన వైఖరిగా కనిపిస్తూ వుంటుంది. ఢిల్లీ నుంచి మొదలైన దండయాత్రలో కేజ్రీవాల్ మొట్టమొదట పదవి నుంచి తప్పించింది కాంగ్రెస్ పార్టీనే. పంజాబ్‌లో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి, అక్కడ కేజ్రీవాల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో ఆప్ పార్టీ రాకముందు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా వుండేది పరిస్థితి కానీ కేజ్రీవాల్ ఎంట్రీతో ఢిల్లీలో కాంగ్రెస్ అంతర్ధానమై ఆప్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అంటే ఢిల్లీలో ఆప్ రాకతో దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీనే. తమతమ రాష్ట్రాలలో బలంగా వున్నపుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం ద్వారా ప్రాంతీయ పార్టీలు తమ మూలాలను బలహీన పరచుకునే ప్రమాదమూ లేకపోలేదు. నిజానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక విధంగా తమ తమ ప్రాంతాలకు సంబంధించిన సంస్కృతి లేదా ఏదైనా సెంటమెంటుతో ముడిపడే రాజకీయాలు చేస్తాయి. మరి జాతీయ స్థాయిలో ఎదగాలంటే ఆ ప్రాంతీయ ఫ్లేవర్‌ని కాస్త పక్కన పెట్టాల్సి వుంటుంది. అందుకు ప్రాంతీయ పార్టీలు ఏ మేరకు సిద్దపడతాయో తెలియదు. ఉదాహరణకు తెలంగాణ సెంటిమెంటు టీఆర్ఎస్‌కు స్పెషల్ ఫ్లేవర్. అదేసమయంలో హిందీ వ్యతిరేకత తమిళపార్టీ డిఎంకేకు ఫ్లేవర్. ఇలాంటి అంశాలు జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ప్రాంతీయ పార్టీలకు ఓ అడ్డంకిగా చెప్పుకోవచ్చు. ఇక ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువగా కనిపించే అధినేత కుటుంబ ఆధిపత్యం కూడా జాతీయ స్థాయికి వెళితే ఇబ్బందిగా మారే అంశంగా చెప్పుకోవచ్చు.

ఇక్కడ మరోమారు థర్డ్ ఫ్రంట్ ఫెయిల్యూర్స్‌ని, మూడో ఫ్రంట్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆడే రాజకీయ క్రీడను ప్రస్తావించాల్సిన అవసరం వుంది. 1977లో తొలిసారి దేశంలో కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తమతమ సిద్దాంతాలను పక్కన పెట్టి మరీ ఒక్కటైన నేతలంతా మొరార్జీ దేశాయ్ సారథ్యంలో జనతా ప్రభుత్వాన్ని ఆనాడు ఏర్పాటు చేశాయి. 1979 మార్చిలో దేశ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొరార్జీని కేవలం రెండు సంవత్సరాల 3 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ గద్దె దింపింది.  అధికార కూటమిలో చీలిక తెచ్చి.. చౌదరీ చరణ్ సింగ్‌ను ప్రధానిగా చేస్తూ బయటి నుంచి మద్దతు ప్రకటించారు ఆనాటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీ. అయితే 1979 జులై 28న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన చరణ్ సింగ్ కేవలం అయిదున్నర నెలల్లోనే అంటే 1980 జనవరి 14వ తేదీన కాంగ్రెస్ రాజకీయ క్రీడలో భాగంగా పదవి కోల్పోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘన విజయం సాధించి మరోసారి దేశప్రధాని అయ్యారు. కానీ పదవీకాలం పూర్తి కాకుండానే ఖలిస్తాన్ తీవ్రవాదుల చేతిలో బలయ్యారు. ఆ తర్వాత 1989లో నేషనల్ ఫ్రంట్ పేరిట మరోసారి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. దానికి వీపీ సింగ్ సారథ్యం వహించారు. వీపీ సింగ్ ప్రభుత్వానికి అప్పట్లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మార్పు షరతుతో మద్దతు ప్రకటించింది. ఫలితంగా చంద్రశేఖర్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. దానికి కాంగ్రెస్ పార్టీ బయట్నించి మద్దతు ప్రకటించింది. కానీ గతంలో తన తల్లి ఇందిరా గాంధీ అవలంభించిన పొలిటికల్ గేమ్‌నే రాజీవ్ గాంధీ అమలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నవంబర్, 1990లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ నాలుగు నెలలు కూడా అధికారంలో కొనసాగలేదు. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో సార్వత్రిక ఎన్నికల దిశగా అడుగులు పడ్డాయి. చంద్రశేఖర్ ఆపద్ధర్మ ప్రధానిగా 1991 ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1996లో మరోసారి దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. లోక్ సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. దాంతో ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు రాష్ట్రపతి. అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువు దీరింది. కానీ కేవలం 13 రోజుల్లోనే వాజ్ పేయి రాజీనామా చేయాల్సి వచ్చింది. కారణం బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడమే. ఆ తర్వాత తెరవెనుక చక్రం తిప్పిన కొన్ని పార్టీలు దేవెగౌడ ప్రధానిగా యునైటెడ్ ఫ్రంట్ సర్కార్‌ను ఏర్పాటు చేశాయి. బీజేపీని నిలువరించే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ యుఎఫ్‌కు బయట్నించి మద్దతు ఇచ్చింది. కానీ.. ఏడాదిన్నర తిరక్క ముందే ప్రధానిని మార్చాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. దాంతో ఐకే గుజ్రాల్‌ను ప్రధానిని చేశారు. మళ్ళీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన అత్త ఇందిర, భర్త రాజీవ్ అనుసరించిన రాజకీయ క్రీడనే ఫాలో అయ్యారు. గుజ్రాల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడం ద్వారా 1998లో మధ్యంతర ఎన్నికలకు కారణమయ్యారు. అంటే థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిన ఏ సందర్భంలోను వారు పట్టుమని మూడేళ్ళ పాటు కూడా ప్రభుత్వాన్ని నడపలేకపోయారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలిగే స్థాయిలో ప్రాంతీయ పార్టీలు నెంబర్ గేమ్ ద్వారా సాధించగలవేమో కానీ.. సుస్థిరంగా అయిదేళ్ళు పాలించేందుకు మాత్రం అది సరిపోదేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: TELANGANA POLITICS: తెలంగాణాలో రాజకీయ కలకలం.. యాత్రల జోరు.. అధికార పార్టీ ఎదురు దాడి.. నిండువేసవిలో రాజకీయ పండగ