Gujarat Elections 2022: గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. AAPకు బిగ్ బూస్ట్..
Gujarat Assembly Election 2022: పంజాబ్‌లో అధికార పగ్గాలు సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. త్వరలో అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
Gujarat Assembly Election 2022: పంజాబ్‌లో అధికార పగ్గాలు సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(AAP).. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. త్వరలో అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్.. ముచ్చటగా మూడో రాష్ట్రం గుజరాత్‌లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ దిశగా తన కార్యాచరణను ఆ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఇప్పటికే మొదలుపెట్టారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు.. ఆమ్ ఆద్మీ పార్టీయేనని గుజరాత్‌లో ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్‌లో సంపన్న రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రానిల్ రాజ్‌గురు(Indranil Rajguru) ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో అధికార బీజేపీని గద్దె దించే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి – ఆమ్ ఆద్మీ పార్టీగా ఆయన అభివర్ణించారు. అందుకే ఆ పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. ఆమ్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్‌పై కూడా ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీ నాయకులకు ఆయన ఇచ్చే గౌరవం, ప్రాముఖ్యత తనను ఆకట్టుకుందని చెప్పుకొచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోటీశ్వరుడైన ఇంద్రానిల్ రాజ్‌గురు ఆప్‌కు జంప్ కావడం కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. మూడు వారాల క్రితం గుజరాత్ పీసీసీ(GPCC) ఉపాధ్యక్షుడిగా ఇంద్రానిల్ నియమితులయ్యారు. అనూహ్యంగా ఆయన కాంగ్రెస్‌ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీ గూటికి చేరడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Former MLA, Senior Congress Leader Indranil Rajguru joined AAP today
Also Congress Leader Vashram Sagathiya joined AAP today@ArvindKejriwal pic.twitter.com/cIGXNw8yl5
— M.Amin Dar AAP (@MAminDar6) April 14, 2022
ప్రజలకు సేవ చేసేందుకే తను కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నట్లు ఇంద్రానిల్ చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రజలను మోసగించి అధికారంలోకి వస్తోందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగడంలో విఫలం చెందిందని అన్నారు. బీజేపీని ఓడిస్తామన్న ఆత్మ స్థైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించారు. గుజరాత్‌లో బీజేపీకి ఆప్ ప్రత్యామ్నాయం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇంద్రానిల్ రాజ్‌గురు ఎవరు?
కాంగ్రెస్ నేత సంజయ్ రాజ్‌గురు తనయుడైన ఇంద్రానిల్.. రాజ్‌కోట్(ఈస్ట్) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. రూ.122 కోట్ల ఆస్తులతో గుజరాత్ అసెంబ్లీలో అత్యంత సంపన్నుడుగా ఆయన నాటి అసెంబ్లీలో గుర్తింపుసాధించారు.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌కోట్(వెస్ట్) నియోజకవర్గం నుంచి నాటి సీఎం విజయ్ రుపానిపై పోటీ చేసి 50వేల తేడాతో ఓటమి చెందారు. అప్పట్లో పార్టీ అధిష్టానం వద్దని చెప్పినా.. ఆయనే స్వయంగా ఏరికోరి బీజేపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
ఒకేసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ధనబలం కారణంగా గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఇంద్రానిల్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. సంపన్న నాయకుడు కావడంతో ఆయనకు పార్టీ అధిష్టానం ప్రాముఖ్యత కల్పించేది. రాజ్‌కోట్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులన్నీ ఆయనే భరించేవారు. గుజరాత్‌లో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు హోటల్స్, విద్యా సంస్థలు నడుపుతున్నారు.
డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు..
గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలకు ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌తో పాటు ఎంఐఎం కూడా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్నాయి. దీంతో చాలా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read | Karnataka Rains: బెంగళూరులో భారీ వర్షాలు.. మరో 3 రోజులు కురిసే అవకాశం.. జనజీవనం అస్తవ్యస్తం.. ఒకరు మృతి..