
కాశ్మీర్‌లోని ప్రసిద్ధ వూలర్ సరస్సులో దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వికసించిన తామర పువ్వులు చూసేందుకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ అద్భుత దృశ్యం చూపరులకు ఆహ్లాదకరంగా ఉంది. ఒకప్పుడు సరస్సుకి అందాన్ని పెంచిన ఈ తామర పువ్వులు పర్యావరణ క్షీణత కారణంగా అదృశ్యమయ్యాయి. అయితే దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ సరస్సులో తిరిగి వికసించడం వలన ప్రజలు “దేవుడు ఇచ్చిన బహుమతిని శాశ్వతంగా కోల్పోయామని భావించిన స్థానికులకు ఉపశమనం కలిగింది. వూలర్ సరస్సులో వికసించిన తామర పువ్వులు భవిష్యత్తు పర్యావరణ ఆరోగ్యానికి ఆశాజనకమైన సంకేతాన్ని అందిస్తుంది.
వూలర్ సరస్సు.. కాశ్మీర్ గర్వం
ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటైన వులార్ సరస్సు కాశ్మీర్ ఉత్తర భాగంలో బండిపోరా జిల్లా పరిధిలో ఉంది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీరు, పచ్చని వృక్షసంపదకు ప్రసిద్ధి చెందిన ఈ సరస్సు అక్కడ నివసించే వేలాది మందికి జీవనాధారంగా ఉండేది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం, ఆక్రమణ, అధిక బురద కారణంగా సరస్సు పర్యావరణం తీవ్రంగా ప్రభావితమైంది. ఫలితంగా తామర పువ్వులు, కలువ పువ్వులు సహా అనేక అరుదైన మొక్కలు సరస్సు నుంచి అదృశ్యమయ్యాయి.
30 సంవత్సరాల తర్వాత తిరిగి వికసిస్తున్న తామరలు
మూడు దశాబ్దాల తర్వాత వూలర్ సరస్సులో తామర పువ్వులు భారీ సంఖ్యలో వికసించాయి. సరస్సులోని అనేక ప్రాంతాలలో తామర పచ్చిక బయళ్ళు కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ తామరలు వికసించడం సరస్సు పర్యావరణం మెరుగు పడిందని అనడానికి ఒక ముఖ్యమైన సంకేతంగా పరిగణిస్తున్నారు.
సమాజ ఆనందం: కలువలు, తామరలు తిరిగి వికసించడంతో స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ పువ్వులు ఈ సరస్సులో ఒక భాగం. గత 30 సంవత్సరాలుగా మేము వాటిని చూడలేదు. మేము వాటిని దేవుడిచ్చిన బహుమతిగా భావించాము. వాటిని శాశ్వతంగా కోల్పోయామని భావించాము. ఇప్పుడు అవి మళ్ళీ వికసిస్తున్నాయి, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల ఫలితం?
వూలర్ సరస్సును రక్షించడానికి, పునరుద్ధరించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సరస్సు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించడం, బురదను తొలగించడం, మురుగునీటిని శుద్ధి చేయడం వంటి ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. ఈ పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలు ఫలించడం ప్రారంభించాయనడానికి సజీవ సక్షమే నేటి వూలర్ సరస్సులోని తామరలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..