ఓటు అనేది ప్రజాస్వామ్య సమాజానికి పునాది వంటిది. అయితే ఇప్పటి వరకు చాలా మంది యువత ఓటు నమోదు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఓటు వ్యవస్థ లక్ష్యం నీరుగారిపోతోంది. ఈ పరిస్థితిని గమనించిన మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో అడ్మిషన్ల కోసం 18 సంవత్సరాలు పై బడిన వారందరికీ ఓటరు నమోదును తప్పనిసరి చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా వచ్చే ఏడాది జూన్ నుంచి జాతీయ విద్యావిధానం ద్వారా రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థలోని 50 లక్షల మంది విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో కేవలం 32 లక్షల మంది మాత్రమే ముందుకొచ్చారు. దీంతో అధికారులు ఓటరు నమోదు ప్రక్రియకు, అడ్మిషన్లకు లింక్ పెట్టారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం ఓటరు నమోదును తప్పనిసరి చేశారు.
కాగా.. జాతీయ విద్యా విధానంలో భాగంగా వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఎన్ఈపీ అమలు చేసే సమయంలో వచ్చే అనుమానాలు, సందేహాలను పరిష్కారించేందుకు త్వరలోనే రిటైర్డ్ వైస్ ఛాన్స్‌లర్ల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మరోవైపు.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. 17 నుంచి 19 ఏళ్ల వయసు వారి వివరాలు సేకరించి అందరికీ ఓటు హక్కు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం