థానే, ఆగస్టు 21: మహారాష్ట్రలోని థానేలో బద్లాపూర్-అంబర్‌నాథ్ రహదారిలో రోడ్‌లో మంగళవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నల్లటి టాటా హారియర్ కారు రోడ్డుపై భీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఆగివున్న వైట్ కలర్ టయోటా ఫార్చ్యూనర్ కారును బ్లాక్ కలర్ ఎస్‌యూవీ రెండుసార్లు ఢీ కొట్టింది. అదే రోడ్డుపై వెళ్తున్న మరో రెండు బైకులను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం అంబర్‌నాథ్-బద్లాపూర్ రోడ్డులో ఎస్3 పార్క్ హోటల్ సమీపంలో చోటు చేసుకుంది. దీంతో రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సంఘటన సమయంలో టయోటా ఫార్చ్యూనర్ కారు వెనుక సీటులో ఓ మహిళ, బాలుడు కూర్చుని ఉన్నారు. వీరు భయంతో గట్టిగట్టిగా అరుస్తుండగా.. అటుగా దూసుకొచ్చిన బ్లాక్ కలర్ ఎస్‌యూవీ.. వీరికారును రాజుకుంటూ వెళ్లింది. అనంతరం కాస్తముందుకు వెళ్లి మళ్లీ బ్యాక్‌కు వచ్చింది. ఈ క్రమంలో అదే రోడ్డుపై మరో ఇద్దరు బైకర్లను ఢీకొట్టింది. రోడ్డుపై వెళ్తున్న మరో వ్యక్తిని ఢీకొట్టి కొన్ని మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. వెనక్కి వచ్చిన ఎస్‌యూవీ కారు బలంగా వచ్చి ఆగివున్న ఫార్చ్యూనర్ కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఫార్చ్యూనర్ కారు వెనుక సీట్లో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను రోడ్డుపై ఇతర ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు చేరవేశారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. రెండు వర్గాల మధ్య పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి కేసు నమోదు కాలేదని మీడియాకు తెలిపారు.
This video is from Ambarnath, Thane.
Really Shocking Video. pic.twitter.com/rEUUzwsoca
— Vivek Gupta (@imvivekgupta) August 20, 2024
ముంబైలో జరిగిన మరో ఘటనలో వెర్సోవా బీచ్‌లో నిద్రిస్తున్న 36 ఏళ్ల గణేష్ యాదవ్ అనే రిక్షా డ్రైవర్‌ను తెల్లటి SUV కారు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆగస్టు 12 తెల్లవారుజామున జరిగింది. యాదవ్, అతని స్నేహితుడు బబ్లూ శ్రీవాస్తవ బీచ్‌లో పడుకుని ఉండగా.. బీచ్‌లోకి ప్రవేశించిన కారు గణేశ్‌పై నుంచి దూసుకెళ్లింది. అతడి పక్కనే ఉన్న బబ్లూ తృటిలో తప్పించుకున్నాడు. కారులో ఉన్న నిఖిల్ జవాలే (34), శుభమ్ డోంగ్రే (33) యాదవ్ సంఘటన తర్వాత పరారయ్యారు.