
పెళ్లయి కనీసం రెండు నెలలు కూడా నిండకముందే.. అత్తింటి వారు పెట్టే టార్చర్ బరించలేక ఓ ఇల్లాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముంబై సమీపంలో ఠాణెలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాణెకు చెందిన డాక్టర్ నితిన్ తాల్కర్ అనే వ్యక్తికి ఇటీవలే విశాఖ అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లికి ముందు వరకు వరుడి ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు లేవు.. అంతా సవ్యంగానే జరిపించారు. కానీ వివాహం కాగానే అత్తమామలు తమ అసలు స్వరూపం చూపించారు. పెళ్లిలో తమకు ఆశించిన స్థాయిలో కట్నకానుకలు, మర్యాదలు దక్కలేదనే నెపంతో విశాఖను వేధించడం ప్రారంభించారు. పుట్టింటి నుండి మరిన్ని నగలు, డబ్బు తీసుకురావాలంటూ నిరంతరం మానసిక, శారీరక ఒత్తిడికి గురిచేయడం చేశారు.
కనీసం పక్కింటి వారితో కూడా మాట్లాడకుండా ఆంక్షలు విధించారు. దానికి తోడు విశాఖ ఎప్పుడు ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుందని తెలుసుకునేందుకు అంబర్‌నాథ్‌లోని తన ఇంటిని మొత్తం సీసీటీవీ (CCTV) కెమెరాలతో నింపేశాడు నితిన్. వాటిని ద్వారా ఆమె ప్రతి కదలికపై 24 గంటలూ నిఘా ఉంచాడు. విశాఖ, ఎవరితోనైనా మాట్లాడితే దాన్ని సీసీ కెమెరాలో చూసి ఇంటికి రాగానే భర్త ఆమెను దారుణంగా హింసించే వాడు.
అయితే ఒక రోజు ఇంటి పక్కన ఉండే ఒక మహిళతో మాట్లాడిందనే కారణంతో అత్తమామలతో కలిసి భర్త ఆమెను తీవ్రంగా కొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అత్తింటి వారు పెడుతున్న బాధలను తట్టుకోలేకపోయిన విశాఖ.. ఇక్కడ జరుగుతున్న విషయాలను మొత్తం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. తనను పుట్టింటికి తీసుకెళ్లాలంటూ కన్నీరు పెట్టుకుంది. కానీ పేరెంట్స్ వచ్చి ఆమెను తీసుకెళ్లేలోపే ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది.
ఇదే విషయాన్ని విశాఖ తల్లిదండ్రులు కన్నీరు పెడుతూ తెలిపారు. మా అమ్మాయి పడుతున్న బాధలు చూడలేక, ఆమెను తిరిగి మా ఇంటికి తీసుకువచ్చే ప్రయత్నాల్లో మేము ఉన్నాము. కానీ అంతలోనే ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందనే వార్త వినాల్సి వచ్చింది అని విశాఖ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తన కుమార్తె చావుకు అత్తింటి వేధింపులే కారణమని స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
భర్త అరెస్ట్.. మిగిలిన వారి కోసం గాలింపు
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విశాఖను మానసిక, శారీరక వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గానూ భర్త నితిన్ తాల్కర్, అత్త ఛాయా, మరిది నినాద్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భర్త నితిన్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, అత్త, మరిది పరారీలో ఉన్నారని.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.