
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని మరోసారి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక కశ్మీరీ పండిట్ మరణించాడు. ఈ ఘటన పుల్వామా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పుల్వామా జిల్లాలోని అచ్చన్ ప్రాంతానికి చెందిన కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ.. ఆదివారం ఉదయం స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు అతడిపై అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. దీంతో అతనికి బుల్లెట్లు తగలి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి హుటాహుటీనా తరలించారు. ఆయన్ను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు నిర్దారించారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన సంజయ్ శర్మ స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటన అనంతరం హిందువులున్న ఆ గ్రామంలో సాయుధ పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. అదనపు బలగాలను మోహరించి.. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరో కశ్మీరీ పండిట్ మరణించడంతో పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.
ఇదిలాఉంటే.. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేతకు మరిన్ని చర్యలు చేపట్టింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..