
Jayalalitha Poes Garden House: అమ్మ నివాసం వేదనిలయం ఆమె మేనకోడలు దీపకు దక్కింది. చెన్నైలో వేదనిలయం తాళాలను జయలలిత మేనకోడలు దీపకు అందచేశారు అధికారులు. ఇప్పుడు తన మేనత్త ఆత్మశాంతిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు దీప. పూర్తి వివరాలను పరిశీలించినట్లయితే.. దివంగత నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసమున్న పోయెస్ గార్డెన్ తాళాలు ఎట్టకేలకు ఆమె మేనకోడలు దీపకు దక్కాయి. చెన్నై కలెక్టర్ విజయరాణి పోయెస్ గార్డెన్ తాళాలను అధికారికంగా దీపకు అందచేశారు. జయ నివాసం కోసం న్యాయపోరాటంలో నెగ్గారు దీప, ఆమె సోదరుడు దీపక్. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. జయలలిత ఆస్తి ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌కు దక్కింది. తన మేనత్త నివసించిన ఇంటిలోకి అడుగుపెట్టిన దీప చాలా సంతోషంగా కనిపించారు. ‘‘ఇది మా మేనత్త ఇల్లు. అధికారానికి కేంద్రంగా ఉండకూడదు.. దీనిపై రాజకీయాలు అనవసరం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు దీప. వేదనిలయాన్ని తనకు అప్పగించడంతో జయలలిత ఆత్మ శాంతిస్తుందని అన్నారు దీప. ఇక్కడికి రాకుండా తనను అడ్డుకోవడానికి చాలామంది కుట్ర చేశారని, కానీ న్యాయం తన వైపే ఉందన్నారు దీప. ఇకపై వేదనిలయం నిర్వహణ బాధ్యతలను తామే చూసుకుంటామని తెలిపారు.
వేద నిలయాన్ని దీపకు అప్పగించాలని నవంబర్ 24న మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ‘‘ఇది చిన్న విజయం కాదు.. చాలా పెద్ద విజయం. నా మేనత్త ఇంట్లోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది.’’ అన్నారు దీప. తాను ఇక్కడే పుట్టానని తెలిపారు. తన భర్త మాధవన్, సన్నిహితులతో కలిసి వేదనిలయానికి వచ్చారు దీప. జయలలిత ఫోటోకు నివాళి అర్పించారు. తన మేనత్తతో చిన్నప్పుడు గడిపిన క్షణాలు ఇప్పటికి కూడా గుర్తుకొస్తున్నాయని అన్నారు దీప. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం పోయెస్ గార్డెన్ నివాసాన్ని మ్యూజియంగా మార్చేందుకు ప్రయత్నించింది. అయితే మద్రాస్ హైకోర్టు అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది.. జయ వారసులకు నివాసాన్ని అప్పగించాలని ఆదేశించింది.
Also read:
Nayanthara: మరో కొత్త వ్యాపారంలోకి లేడీ సూపర్ స్టార్.. బ్యూటీ బిజినెస్‌లో పెట్టుబడులు..
Semiconductor: సెమీకండక్టర్ అంటే ఏమిటి.. వాటి కొరత ఎందుకు వచ్చింది..?