Tamil Nadu Rains: తమిళనాడును వణికిస్తున్న వరుణుడు.. కుండపోత వర్షాలతో విలవిల్లాడుతున్న జనాలు..

|

Nov 12, 2022 | 9:49 PM

తమిళనాడుపై మరోసారి వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో.. పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎన్నో కాలనీలు..

Tamil Nadu Rains: తమిళనాడును వణికిస్తున్న వరుణుడు.. కుండపోత వర్షాలతో విలవిల్లాడుతున్న జనాలు..
Tamil Nadu
Follow us on

తమిళనాడుపై మరోసారి వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో.. పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎన్నో కాలనీలు జలదిగ్భందంలో ఇరుక్కుని.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు జనం. కుండపోత వానలతో విలవిలలాడిపోతోంది తమిళనాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నానా అవస్తలు పడుతున్నారు. రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆలయాల్లోకి భారీగా వరదనీరు చేరింది. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఇళ్లలోని వస్తువులన్నీ నీటి పాలవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

భారీ వర్షాలతో స్కూల్స్‌, కాలేజీలు మూతబడ్డాయి. రోడ్లపై భారీగా చేరిన వరదనీటితో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల సబ్‌వేలు మూసివేశారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. మోటార్లతో రోడ్లపై నిలిచిన నీటిని తోడేస్తున్నారు. ఇక ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద పోటెత్తడంతో లక్షల ఎకరాల్లో పంట ముంపుకు గురైంది. పలు గ్రామాలు నీటమునిగాయి. నిత్యావసరాలు కోసం జనం పడిగాపులు పడుతున్నారు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పేట, తిరువళ్లూరు సహా పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది.

మరోవైపు పుదుచ్చేరి, కారైకాల్‌లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవంటోంది. దీంతో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు అధికారులు. అలాగే సముద్ర తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. అలల ఉధృతితో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..