తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సీఎం వార్ మరో మలుపు తిరిగింది. గవర్నర్ రవిపై డైరెక్ట్ వార్ ప్రకటించింది డీఎంకే. ఇక, అసెంబ్లీ సాక్షిగా చెలరేగిన మంటలకు మరింత అగ్గి జోడించారు గవర్నర్ రవి. ఇంతకీ, గవర్నర్ ఏం చేశారు? డీఎంకే రియాక్షన్ ఏంటి? రంజుమీదున్న తమిళ రాజకీయాలపై ప్రత్యేక కథనం మీకోసం..
ఒకవైపు గవర్నర్ రవి, మరోవైపు సీఎం స్టాలిన్.. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గట్లేదు. నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం అన్నట్టుగా ఎత్తుకు పైఎత్తులేస్తూ పొంగల్ ముందు తమిళనాట పొలిటికల్ కాకరేపుతున్నారు. అయితే, అసెంబ్లీ వేదికగా అంటుకున్న మంటలు రాష్ట్రమంతటా పాకేశాయ్. తమిళనాడు పేరును తమిళిగంగా మార్చాలన్న గవర్నర్ మాటలపై డైరెక్ట్ వార్ ప్రకటించింది డీఎంకే. ‘గెట్ అవుట్ రవి’ పేరుతో తమిళనాట అంతటా పోస్టర్లు అంటిస్తోంది. ఇప్పుడీ పోస్టర్లు తమిళనాడులో కలకలం రేపుతున్నాయ్. సోషల్ మీడియాలో సైతం గెటవుట్ రవి పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తోంది డీఎంకే.
అయితే, ఎవరేం చేసుకున్నా తన దారి తనదే అంటున్నారు గవర్నర్ రవి. అసెంబ్లీ స్పీచ్‌కి కొనసాగింపుగా పొంగల్ ఇన్విటేషన్‌తో మంటలను మరింత రాజేశారు. ఆహ్వాన పత్రాల్లో తమిళనాడు బదులు తమిళిగం అని రాశారు. వీవీఐపీలకు గవర్నర్ రవి పంపిన ఈ ఆహ్వానాలు ఇప్పుడు మరింత వివాదాన్ని రాజేస్తున్నాయి. తమిళనాడు పేరును తమిళిగం గా మార్చాలన్న గవర్నర్ రవి మాటలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సినీ నటులు సైతం గవర్నర్ రవి తీరు తప్పుబడుతున్నారు. అసెంబ్లీలో గవర్నర్‌కు సీఎం స్టాలిన్ దీటుగా సమాధానం చెప్పారంటూ హాట్ కామెంట్స్ చేశారు యాక్టర్ సత్యరాజ్. ఒక తమిళుడిగా స్టాలిన్‌ను చూస్తే గర్వంగా ఉందన్నారాయన.
ఒకవైపు అధికార పార్టీ డీఎంకే నుంచి, మరోవైపు తమిళుల నుంచి భారీ నిరసనను ఎదుర్కొంటున్నారు గవర్నర్ రవి. అయితే, ఎవరేమనుకున్నా తాను మాత్రం తగ్గేదేలే అంటున్నారు గవర్నర్. మరి, ఈ వార్ ఎక్కడివరకు వెళ్తుందో?. ఎలాంటి మలుపులు తిరుగుతుందో? చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..