Tamil Nadu Lockdown: దేశంలో ఒక వైపు వ్యాక్సినేషన్, లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతుంటే మరోవైపు కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో దాదాపు చాలా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో క్రమ క్రమంగా మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అన్‌లాక్ చేస్తున్నాయి. క్రమ క్రమంగా లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోనూ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం.. తాజాగా నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జూలై 12 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు సర్కార్ ఇప్పటికే పలు ఆంక్షలు సడలించింది.
అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 50 శాతం సామర్థ్యంలో హోటళ్లు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు కూడా తెరచుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు సాగించుకోవచ్చు. అలాగే సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, కళాశాలలు, జంతు ప్రదర్శనశాలలు తెరవడానికి వీలులేదు. వైరస్ తీవ్రతను బట్టి మొత్తం 38 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం మూడు కేటగిరిలు విభజించింది. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న 11 జిల్లాలను మొదటి కేటగిరీగానూ, వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న 23 జిల్లాలను రెండో కేటగిరీగానూ, రికవరీ రేటు మెరుగ్గా ఉన్న 4 జిల్లాలను మూడో కేటగిరీగా విభజించి ఆంక్షలు అమలు చేసింది. అయితే ఇకపై అన్ని జిల్లాల్లోనూ ఒకే రకమైన ఆంక్షలు ఉంటాయని తాజా ప్రభుత్వం స్పష్టం చేసింది.