మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నది నానుడి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఎంత ఎదిగితే అంత సమస్య ఎదురవుతోంది. ఈ వ్యక్తి ఎదిగేది ఆర్ధికంగా, సామాజికంగా కాదు, శారీరకంగా. అవును అతని ఎత్తు ఏడున్నర అడుగులు. అదే అతనికి సమస్యగా మారింది. కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు, చదువుకునే అవకాశం లేదు. దాంతో చిన్నప్పటినుంచి కూలిపని చేసుకునే బ్రతికాడు. పదిహేనేళ్లవరకూ అందరిలాగే సామాన్యంగా పెరిగినా.. పాతికేళ్లు వచ్చేటప్పటికి ఆరున్నర అడుగులు ఎత్తు పెరిగాడు. దాంతో శరీరం నిస్సత్తువను ఆవహించి తన శరీరం తనకే భారంగా మారింది.
తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రాంతమైన ఔరాద్ తాలూకా చింతాకి గ్రామానికి చెందిన మారుతి హనుమంత కోళి అనే 40 ఏళ్ల వ్యక్తి 7.5 అడుగుల ఎత్తుగా ఉంటారు. ఆ ఎత్తుకు తగిన శక్తి ఒంట్లో లేకపోవడంతో రెండేళ్లుగా తన దేహమే తనకు భారమైందని ఆవేదన చెందుతున్నాడు. మారుతికి మరో ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. మారుతి పెద్దవారు. రెక్కాడితేకానీ డొక్కాడని జీవితాలు. దాంతో ముగ్గురూ చదువుకోలేకపోయారు. ఇద్దరు తమ్ముళ్లకూ వివాహం చేశారు. కానీ మారుతి ఒంటరిగా మిగిలిపోయారు. మారుతికి కన్నడ, తెలుగు, మరాఠీ, హిందీ భాషలు మాట్లాడగలరు.
రెండేళ్ల కిందటి వరకు గొర్రెలు కాయడం, పొలాలకు కాపలాకు వెళ్లడం, ఇతర కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించారు. కొన్ని రోజులు కిరాణా దుకాణం కూడా నడిపారట. ప్రస్తుతం అనారోగ్యం సమస్యలతో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నానని, తన తల్లి, సోదరుల కుటుంబ సభ్యులకు తాను భారంగా మారానని ఆవేదన చెందుతున్నారు. అనారోగ్యం బారిన పడక ముందు హనుమంతను తమ ప్రాంతాల్లో జరిగే వినోద కార్యక్రమాలకు, శుభ కార్యాలకు, జాతరలకు తీసుకుని వెళ్లి కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. అంతేకాదు కొందరు మారుతితో ఫొటో తీయించుకున్న వారు కొంత డబ్బు ఇచ్చేవారు. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా 1400 రూపాయలు పింఛను వస్తుండగా, అది తన మందులకు కూడా సరిపోవడం లేదని, ప్రభుత్వం తనకు త్రిచక్ర వాహనం, సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రుణం ఇప్పించాలని మారుతి హనుమంత కోళి కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..