29శాతం కరోనా కేసులు తబ్లిఘీవే.. ప్రజల్లో రెట్టింపైనా ఆందోళన

దేశం యావత్తును ఇవాళ కరోనా కరాళ నృత్యం కుదిపేస్తోందంటే దానికి కారణం కచ్చితంగా తబ్లిఘీ జమాత్ సంస్థే అని చెప్పే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం (ఏప్రిల్ 18) సాయంత్రానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 15 వేలకు చేరువవుతోంది.

29శాతం కరోనా కేసులు తబ్లిఘీవే.. ప్రజల్లో రెట్టింపైనా ఆందోళన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 18, 2020 | 5:35 PM

దేశం యావత్తును ఇవాళ కరోనా కరాళ నృత్యం కుదిపేస్తోందంటే దానికి కారణం కచ్చితంగా తబ్లిఘీ జమాత్ సంస్థే అని చెప్పే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం (ఏప్రిల్ 18) సాయంత్రానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 15 వేలకు చేరువవుతోంది. ఈ క్రమంలో తాజాగా గణాంకాలలో తబ్లిఘీ కారణంగా ప్రబలిన కేసుల సంఖ్యపై క్లారిటీ వచ్చింది.

శనివారం సాయంత్రానికి దేశంలో మొత్తం 14 వేల 378 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా అందులో 29.8 శాతం కేసులు అంటే నాలుగు వేల రెండొందల తొంభై ఒక్క కేసులు కేవలం తబ్లిఘీ ద్వారా వ్యాపించినవే కావడం ఆ సంస్థ ప్రభుత్వ, పోలీసు ఆదేశాలను బేఖాతరు చేసి నిర్వహించిన సదస్సే కారణమని తేలిపోయింది. దేశంలో మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కరోనా విస్తరించడానికి నిజాముద్దీన్ మర్కజ్ సదస్సు కారణమైంది.

సదస్సు నిర్వాహకులు, పాల్గొన్న వారు ఎందుకు రహస్యంగా సంచరించారు అనడానికి ఎలాంటి కారణాలను పోలీసులు ఇప్పటి వరకు వెలికి తీయకపోవడంతో ప్రజల్లో చాలా సందేహాలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో మొత్తం కేసుల్లో 84 శాతం తబ్లిఘీ కారణంగా సంక్రమించినవే కావడం పరిస్థితిలో తీవ్రతను చాటులోంది. ఢిల్లీలో 63 శాతం కేసులు, తెలంగాణలో 79 శాతం కేసులు, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 79 శాతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 61 శాతం కరోనా పాజిటివ్ కేసులు తబ్లిఘీ జమాత్ సదస్సుకు హాజరైన వారి ద్వారా సంక్రమించినవేనని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి.

ఈ క్రమంలో ఇంకా కొన్ని మసీదుల్లో ఇరాన్, కర్గిస్తాన్ వంటి దేశాలకు చెందిన మర్కజ్ వర్కర్లు రహస్యంగా తలదాచుకున్నారన్న వార్తలు ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో చాలా ప్రాంతాల్లో రోహింగ్యాలు రహస్యంగా సంచరిస్తున్నారన్న కథనాలు, వార్తలు ప్రజల్లో ఆందోళన రెట్టింపు చేస్తున్నాయి. ఎన్ని రోజుల లాక్ డౌన్ కొనసాగించినా.. ఇలాంటి ప్రమాదకర వ్యక్తుల ఆచూకీ తీయడంలో పోలీసులు, ప్రభుత్వాలు అలక్ష్యం వహిస్తే ఉపయోగం ఏముంటుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.