Nupur Sharma: నూపుర్‌ శర్మకు ఊరట.. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశం..

|

Jul 19, 2022 | 5:31 PM

తన అరెస్ట్‌ను ఆపాలంటూ నుపుర్‌ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీకి కేసులు బదిలీ చేయాలని కూడా కోరారు.

Nupur Sharma: నూపుర్‌ శర్మకు ఊరట.. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశం..
Nupur Sharma
Follow us on

Supreme Court relief for Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆగస్ట్‌ 10 వరకు నూపుర్‌ శర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. నూపుర్‌కు ప్రాణహాని ఉందన్న విషయాన్ని నమ్ముతున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. పౌరుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉంటుందని స్పష్టం చేసింది. నూపుర్‌ శర్మపై 8 రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. తన అరెస్ట్‌ను ఆపాలంటూ నుపుర్‌ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీకి కేసులు బదిలీ చేయాలని కూడా కోరారు. కాగా.. నూపుర్‌శర్మ పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పార్ధీవాలా బెంచ్‌ విచారణ జరిపారు. ఆమెపై నమోదైన పలు కేసుల్లో ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. కాగా.. ఇప్పటికే.. నూపుర్‌ శర్మపై కోల్‌కతా పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల కేసులో తమ ముందు హాజరుకావాలని కోరారు. అయితే తనకు ప్రాణహాని ఉందని, విచారణకు హాజరు కాలేనని నూపుర్‌ నోటీసులకు జవాబిచ్చారు.

కాగా.. ఓ టీవీ ఛానల్‌లో చర్చా కార్యక్రమం సందర్భంగా నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే గాక, అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిన బీజేపీ ఆమెను సస్పెండ్‌ చేసింది. ఈ వ్యాఖ్యలపై దేశంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు సైతం చెలరేగాయి. ఈ కేసుపై జులై 1వ తేదీన విచారించిన సుప్రీంకోర్టు నుపుర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు ఆమే బాధ్యురాలంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి