Sedition Law: దేశద్రోహం చట్టం అమలుపై స్టే.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Supreme Court on Sedition Law: వలస రాజ్యం నాటి ఈ చట్టాన్ని పునః సమీక్షించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని..

Sedition Law: దేశద్రోహం చట్టం అమలుపై స్టే..  సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
Supreme Court
Follow us
Sanjay Kasula

|

Updated on: May 11, 2022 | 1:15 PM

దేశంలో అత్యంత దుర్వినియోగమవుతున్న రాజద్రోహం కేసుల్లో సుప్రీంకోర్టు(Supreme Court ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని ప్రస్తుతం నిలుపుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ NV రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీతో కూడిన ప్రత్యేక ధర్మాసనం గత కొన్ని రోజులుగా ఈ చట్టంపై వాదనలు వింటోంది. వలస రాజ్యం నాటి ఈ చట్టాన్ని పునః సమీక్షించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 124A కింద నమోదైన కేసులన్నింటి విచారణను నిలుపుచేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఆర్డర్స్ పాస్‌ చేసింది. అంతే కాదు ఈ చట్టంపై నిర్ణయం తీసుకునేంత వరకు కొత్తగా ఎటువంటి కేసులు నమోదు చేయవద్దని కేంద్రాన్ని సూచించింది. అలాగే అన్ని రాష్ట్రాలకు ఈ విషయం తెలియజేసి ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేయకుండా చూడాలని పేర్కొంది. రాజద్రోహం కేసు శిక్ష అనుభవిస్తున్న వారు తగిన కోర్టులను ఆశ్రయించి బెయిల్‌ పొందవచ్చని సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది.

రాజద్రోహం చట్టం విపరీతంగా దుర్వినియోగమవుతోందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. IPC సెక్షన్‌ 124A రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ ఎడిటర్‌స్‌ గిల్డ్‌ ఆఫ్ ఇండియా, మాజీ మేజర్‌ జనరల్‌ SG వొంబట్‌కెరే, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తే బెయిల్‌ పొందేందుకు వీలు ఉండదు. ఈ సెక్షన్‌ కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించే వెసులుబాటు కూడా చట్టంలో ఉంది. గతేడాది జూలై నుంచి ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఈ సమయంలోనూ వలసవాద రాజద్రోహ చట్టం మనకు అవసరమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

రాజద్రోహ నిబంధనలను..

అత్యంత వివాదాస్పద ఈ రాజద్రోహ నిబంధనలను 1837లో బ్రిటన్‌కు చెందిన చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడు థామస్‌ మెకాలే డ్రాఫ్ట్ చేశారు. 1860లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ రూపొందించినప్పుడు దీన్ని ఆ చట్టంలో పొందుపరచలేదు. ఆ తర్వాత దీన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఏం చెప్తోందంటే, “వ్యాఖ్యల ద్వారా, మాటల ద్వారా, రాతల ద్వారా, సైగల ద్వారా, దృశ్య సంకేతాల ద్వారా లేదా ఇంకా ఏ విధంగానైనా భారతదేశంలో చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వంపై వ్యతిరేకత, ద్వేషాన్ని, ధిక్కారాన్ని ప్రోత్సహించడం” రాజద్రోహమవుతుందని చెప్తుంది.

బ్రిటీష్‌వారి పాలనలో స్వాతంత్ర్య సమరయోధులను కట్టడి చేసేందుకు అప్పటి బ్రిటీష్‌ పాలకులు ఈ చట్టాన్ని ప్రయోగించారు. 1897లో మొదటిసారి బాలగంగాధర్‌ తిలక్‌పై రాజద్రోహం కేసు మోపారు. మూడు వేర్వేరు విచారణలు నిర్వహించి ఆయనను రెండుసార్లు జైలుకు పంపించారు. మహాత్మా గాంధీపై కూడా రాజద్రోహం నేరం మోపారు. సాధారణ పరిభాషలో సెడిషన్‌ అంటే దేశద్రోహం లేదా జాతి వ్యతిరేక చర్యగా అనుకుంటారు. కాని చట్టం పరిభాషలో దీన్ని రాజద్రోహం లేదా ప్రభుత్వ వ్యతిరేక చర్యగా పరిగణించడం జరుగుతుంది. అంటే దేశం లేదా జాతికి వ్యతిరేకమైన నేరం కాదిది. ప్రభుత్వానికి వ్యతిరేకమైన చర్య ఇది.

అత్యంత దారుణంగా ఉంటుంది రాజద్రోహ నేర విచారణ. ఈ సెక్షన్ కింద నమోదైన కేసులకు బెయిల్‌ లభించదు. కాని, ఈ కేసుల్లో శిక్ష పడే కేసులు చాలా తక్కువ. 2010 నుంచి 2021 వరకు దేశంలో రాజద్రోహం నేరం కింద 13306 కేసులు నమోదయ్యాయి. కాని శిక్షలు పడిన కేసులు వేళ్ల మీద లెక్కే పెట్టే స్థాయిలో కూడా లేవు. 2016లో రెండు కేసుల్లో కోర్టులు శిక్షలు విధించాయి. 2017లో ఒకటి, 2018లో రెండు, 2019లో 1, 2020లో ఒక కేసులో శిక్షలు పడ్డాయి. రాజద్రోహ కేసుల నమోదు అస్సాం ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఝార్ఖండ్‌, హరియాణా రాష్ట్రాలు ఉన్నాయి. 1958లోనే ఈ చట్టాన్ని అలహాబాద్‌ హైకోర్టు కొట్టేసింది. ఈ సెక్షన్‌లో రాజ్యాంగంలో చొప్పించేందుకు రాజ్యాంగ సభ అంగీకరించలేదు. దీని వలన భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని భావించారు.