OTT, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సుప్రీం కోర్టు నోటీసులు! ఎందుకంటే..?

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నెట్‌ఫ్లిక్స్, ఉల్లు, అమెజాన్‌ ప్రైమ్‌లకు అసభ్య కంటెంట్‌పై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటీటీలో అశ్లీలతను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతూ.. నియంత్రణ లేకుండా అసభ్య కంటెంట్ ప్రసారం అవుతుందని కోర్టు గుర్తించింది. ఈ విషయంలో పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది.

OTT, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సుప్రీం కోర్టు నోటీసులు! ఎందుకంటే..?
Supreme Court On Otts

Updated on: Apr 28, 2025 | 1:40 PM

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ నెట్‌ఫ్లిక్స్‌, ఉల్లు, అమెజాన్‌ ప్రైమ్‌లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అసభ్య కంటెంట్ పై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఎలాంటి చెకింగ్ లేకుండా ఓటీటీలో అసభ్య కంటెంట్ ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌లో ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అభ్యంతరకర కంటెంట్ నిషేధంపై జవాబు చెప్పాలని ఇప్పటికే సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఓటీటీ కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసిందని సుప్రీం కోర్టుకు సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న కంటెంట్‌ పట్ల కేంద్రం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. A రేటింగ్ ఉన్న కంటెంట్‌తో పాటు అసభ్య కంటెంట్‌ను కూడా అందుబాటులో ఉంచడం చట్టరిత్యా నేరం అని, వీటిని కట్టడి చేసేలా నిబంధనలను రూపొందించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అంటూ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ ధర్మాసనం ఇప్పటికే పేర్కొంది.

తాజాగా జరిగిన విచారణలో ఓటీటీ సంస్థలకే కాకుండా పలు సామాజిక మాధ్యమాల హ్యాండిళ్లకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఉల్లు, ఆల్ట్‌టీ ఓటీటీతో పాటు ఎక్స్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లకు సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. ఓటీటీల్లో అసభ్యకరమైన వెబ్‌ సిరీస్‌లపై చాలా కాలంగా ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా కొన్ని ఓటీటీ సంస్థలు ఇలాంటి కంటెంట్‌పై ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మరి సుప్రీం నోటీసులతోనై ఈ ధోరణిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి