Students all pass: ప్రపంచం మొత్తాన్ని కరోనావైరస్ అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి కారణంగా అన్ని రంగాలు పూర్తిగా దెబ్బతిని నష్టాలను చవిచూశాయి. విద్యారంగం కూడా ఏడాది నుంచి పూర్తిగా స్తంభించిపోయింది. మహమ్మారి కారణంగా గతేడాది దాదాపు అన్ని రాష్ట్రాలూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం సైతం ఈ ఏడాది కూడా పరీక్షలను రద్దు చేసింది. 9, 10, 11వ తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 9వ తరగతి వరకూ విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
పుదుచ్చేరిలో కరోనావైరస్ ఉధృతి కారణంగా 9వ తరగతి వరకు పరీక్షలను రద్దుచేస్తున్నట్లు వెల్లడించారు. అయితే 10, 11, 12వ తరగతుల విద్యార్థులకు పరీక్షలుంటాయని స్పష్టంచేశారు. పాఠశాలల పునః ప్రారంభం, పరీక్షల నిర్వహణకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చేసిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళసై గురువారం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఒకటి నుంచి తొమ్మిదో తరగతుల విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్టు రాజ్‌నివాస్ ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రమంతటా ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ తరుణంలో పాఠశాలలు నిర్వహిస్తే కేసులు పెరిగే అవకాశముంది. కావున కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
Also Read: