Nitish Kumar: అధికారంలోకి వస్తే వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా.. బీహార్ సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కామెంట్స్

|

Sep 16, 2022 | 12:01 PM

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడవచ్చనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా కొనసాగుతోంది. ఇదే సందర్భంలో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్..

Nitish Kumar: అధికారంలోకి వస్తే వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా.. బీహార్ సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కామెంట్స్
Nitish Kumar
Follow us on

Nitish Kumar: వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడవచ్చనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా కొనసాగుతోంది. ఇదే సందర్భంలో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్న వేళ.. బీహార్ సిఎం నితీష్ కుమార్ వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకు ఇవ్వడం లేదని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా JDU నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని తెర పైకి తెచ్చారు. బీహార్ కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ గతంలో చాలా సార్లు అడిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని నితీశ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకు వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ఈ హోదా దక్కుతుందని, అలా జరగకపోవడానికి కారణం  తనకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BJP పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.

గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను BJP కొనుగోలు చేసిందని నితీష్ కుమార్ ఆరోపించారు. సొంత పార్టీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను దూరం చేయడం తగదని అన్నారు.  బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి,  బిజెపి నాయకుడు సుశీల్‌కుమార్‌ మోదీ, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌పై నితీశ్‌ కుమార్ మండిపడ్డారు. బిజెపి పెద్దల ఆదేశాలతో వారిద్దరూ తనపై ఇష్టానురీతిలో ఆరోపణలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాగే బీజేపీతో కలిసి పనిచేయడంపైనా ఆయన స్పందించారు. కమలం పార్టీతో తాము చాలాకాలం కలిసి ఉండడం తప్పేనని నితీశ్‌ కుమార్ అంగీకరించారు. బీహార్‌ను విభజించడం వల్ల రెవెన్యూ, గనుల ఆదాయం మొత్తం జార్ఖండ్‌కే వెళ్తోందని నితీశ్‌ కుమార్‌ చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే చాలు కేంద్రంలో ఏ ప్రభుత్వానికైనా మద్దతిస్తామని వివిధ సందర్భాల్లో ప్రకటించారు. బిహార్‌లో నెల రోజుల క్రితమే బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి, ప్రతిపక్షాలతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్‌ కుమార్ కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కోసం ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..