AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నదుల అనుసంధానంపై టాస్క్‌ఫోర్స్‌ బృందం సమావేశం.. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలపై చర్చ

గోదావరి జలాల తరలింపులో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీలో నదుల అనుసంధానంపై టాస్క్‌ఫోర్స్‌ బృందం సమావేశం నిర్వహించింది.

నదుల అనుసంధానంపై టాస్క్‌ఫోర్స్‌ బృందం సమావేశం.. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలపై చర్చ
Balaraju Goud
|

Updated on: Feb 26, 2021 | 7:39 AM

Share

Inter-Linking of Rivers : గోదావరి జలాల తరలింపులో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానంపై కూడా ఈ మీటింగ్‌లో చర్చించారు. ఢిల్లీలో నదుల అనుసంధానంపై టాస్క్‌ఫోర్స్‌ బృందం సమావేశం నిర్వహించింది. టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ శ్రీరామ్‌ వెదిరె నేతృత్వంలో సమావేశం జరిగింది. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానంపై ఈ సందర్భంగా చర్చించారు.

ఉత్తరాది నదుల్లో పుష్కలంగా ప్రవహిస్తున్న నీరు పూర్తిగా ఉపయోగపడక వృథాగా సముద్రం పాలవుతుంటే, దక్షిణాదిలో జలవనరులు పలుచోట్ల ఎండిపోతున్న దుస్థితి. మంచి వర్షాలు కురిసినా.. సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఎడారైపోతున్న ప్రాంతాలకు మిగులు జలాల్ని తరలించి బీడువారుతున్న పొలాలకు సాగు, తాగు నీరు అందించే లక్ష్యంగా చేపట్టిందే నదుల అనుసంధానం.

ఈ నేపథ్యంలోనే నదుల అనుసంధానంపై సుదీర్ఘ సమయం చర్చించారు టాస్క్‌ఫోర్స్‌ బృంద సభ్యులు. గోదావరి జలాల తరలింపులో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుతూ ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్‌ నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ వరకు అనుసంధానం చేస్తూ కెనాల్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ కెనాల్‌ ద్వారా తెలంగాణలోని జిల్లాలకు నీరు అందే అవకాశం ఉంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన వాటా పోగా, వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని మళ్లించేలా ప్రతిపాదనలు చేయాలని నిర్ణయించారు. అటు చత్తీస్‌గఢ్‌ ఉపయోగించుకోలేకపోతున్న గోదావరి జలాలను కావేరి వరకు తరలించేందుకు ప్రతిపాదన చేశారు. దీని వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు కావేరి నది ద్వారా కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. గోదావరి, కృష్ణా అనుసంధానంపై తెలుగు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక తయారు చేయనున్నారు.

మొత్తం మీద పర్యావరణ ప్రభావం, ఆర్థిక పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎక్కువ ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేలా నదుల అనుసంధానంపై ప్రతిపాదనలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఇదిలావుంటే, భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం ప్రతీక. ఏకత్వంలో భిన్నత్వానికి ఇక్కడి వాతావరణం సూచిక. ఉత్తరాదిలో వరదలు వెల్లువెత్తి వూళ్లకు వూళ్లను ముంచెత్తుతున్న సమయంలోనే దక్షిణ భారతంలో తీవ్ర కరవు కాటకాలు తాండవిస్తుంటాయి. దేశంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజిలోనే తాగునీటికి కటకట ఏర్పడితే, మరోవైపు రాజస్థాన్‌లోని థార్ ఎడారి అనుకోని వర్షాలతో తడిసి ముద్దవుతుంది. అటు వానల దరువు, ఇటు చినుకే కరవు. పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. సాగు నీటి వనరులు పక్కనబెడితే, తాగేందుకు గుక్కెడు నీళ్ల కోసం కిలో మీటర్ల మేర వెళ్లాల్సిన పరిస్థితి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్లైనా మారలేదు.

భారతదేశంలోని గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వచ్చే పదేళ్లలో నీటియుద్ధాలు చోటుచేసుకోవచ్చునని అమెరికా గూఢచార నివేదిక ఇటీవల ప్రమాద ఘంటికలు మోగించింది. దేశంలో జల సమతుల్యత లోపించిందని, 2050నాటికి అది వివిధ ప్రాంతాల్లో సంక్షోభానికి దారితీయవచ్చునని జాతీయ జలసంఘం 1999లోనే హెచ్చరించింది. ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి గట్టి చర్యలు చేపట్టాల్సివుంది. ఈ నేపథ్యంలోనే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఇందుకు అనుగుణంగా పరిష్కార మార్గం అనుక్కోవాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. నదుల అనుసంధానానికి సత్వరం పూనుకోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో కేంద్రం జాతీయ స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేసి ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇదీ చదవండిః  ఉద్యోగాల భర్తీపై స్పష్టతనిచ్చిన మంత్రి కేటీఆర్.. బహిరంగంగా లేఖ విడుదల.. ఏ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..