న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: భారత పార్లమెంటు ఎన్నికలు మరికొద్ది నెలల్లో సమీపించనున్నాయి. ఎగువ సభగా పిలిచే రాజ్యసభ స్థానానికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాల్లో అభ్యర్థి పేరు, చిరునామా, రాజకీయ పార్టీ వంటి సమాచారంతోపాటు వ్యక్తిగత వివరాలు కూడా వెల్లడిస్తారు. దీనిలో భాగంగా అభ్యర్థుల ఆస్తుల వివరాలను కూడా బహిర్గతం చేస్తారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కొంతమంది నేతల ఆస్తుల వివరాలు తెలుసుకుందాం..
ఏడు పర్యాయాలు లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈ సారి రాజ్యసభకు అరంగేట్రం చేయనున్నారు. సోనియా గాంధీ సమర్పించిన పోల్ అఫిడవిట్ ప్రకారం ప్రస్తుతం తన వద్ద రూ. 90,000 నగదు ఉందని, తన మొత్తం ఆస్తుల విలువ రూ. 12,53,76,822 (రూ. 12.53 కోట్లు)గా పేర్కొంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన రాజకీయ నాయకుడు ప్రఫుల్ పటేల్ మహారాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. ఆయన లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. ఆయన ప్రకటించిన చరాచర, స్థిరాస్తుల విలువ రూ. 450 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు.
ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్న మాజీ కాంగ్రెస్ విశ్వాసకులు అశోక్ చవాన్, మెరుగైన అవకాశాల ఆకాంక్షలు మరియు జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలలో బిజెపి యొక్క పెరుగుతున్న ప్రభావంపై విశ్వాసంతో నడిచారు. ఆయనకు చర, స్థిరాస్తులు కలిపి రూ.68 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత మిలింద్ దేవ్రా రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేశారు. ఆయన ఆస్తుల విలువ రూ.134 కోట్లు ఉంటుందని అంచనా.
రాజ్యసభకు ఐదోసారి పోటీ చేస్తున్న జయా బచ్చన్, ఆమె భర్త ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆస్తుతో కలిపి మొత్తం రూ.1,578 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.
వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ముగ్గురు అభ్యర్ధులు రాజ్యసభ ఎన్నికల బరిలో దిగారు. వీరిలో రూ.475 కోట్ల ఆస్తులతో వైసీపీ నేత మేడా రఘునాధ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. వైవీ సుబ్బారెడ్డి రూ.118 కోట్లు, గొల్ల బాబూరావు రూ.4.19 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.