దారుణ హత్య.. మహిళ గొంతులో కత్తెరలు దింపి మర్డర్! ఎక్కడంటే..
ఓ ప్రైవేట్ కంపెనీలో పని విషయంలో జరిగిన చిన్న గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. సహోద్యోగితో వాగ్వాదం అనంతరం 25 ఏళ్ల శివాని అనే యువతిపై అస్లాం మియాన్ కత్తెరతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, దాడికి ఉపయోగించిన కత్తెరను స్వాధీనం చేసుకున్నారు..

గురుగ్రామ్, సెప్టెంబర్ 7: రోజువారీ పని విషయంలో మొదలైన చిన్న గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. సహోద్యోగితో జరిగిన వాగ్వాదం అనంతరం 25 ఏళ్ల శివానిపై 35 ఏళ్ల సహోద్యోగి అస్లాం మియాన్ కత్తెరతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గుర్గావ్‌లోని సెక్టార్ 37లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివాని అనే మహిళ ఈ ఏడాది జూలై 13న సెక్టార్ 37లోని NDR Auto Components Pvt Ltdలో ఉద్యోగంలో చేరింది. ఘటన జరిగిన రోజు ఆమె, అస్లాం మియాన్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. షీట్ కవర్లను కత్తిరించే పనికి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో శివాని అస్లాంను చెంపదెబ్బ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన అస్లాం.. కత్తెరతో శివాని మెడపై దాడి చేసినట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను పటౌడీ రోడ్డులోని కదీపూర్‌లో ఉన్న వైదిక్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శివాని మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుర్గావ్ మార్చురీకి తరలించారు. మరోవైపు కంపెనీ ప్రాంగణంలో క్రైమ్ టీమ్, ఫింగర్‌ప్రింట్ నిపుణులు తనిఖీలు నిర్వహించారు. ఘటనకు సంబంధించిన రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, ఇతర ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. శివాని తండ్రి ఆదివారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కంపెనీలో అస్లాంతో జరిగిన గొడవలో తన కుమార్తె గాయపడిందని, అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సెక్టార్ 37 పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం అస్లాం మియాన్‌ను సెక్టార్ 37లో అరెస్టు చేశారు. అతడు బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడి సమాచారం మేరకు ఘటనకు ఉపయోగించినట్లు భావిస్తున్న కత్తెరను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో షీట్ కవర్ కటింగ్ పనికి సంబంధించిన వివాదమే గొడవకు కారణమైందని అస్లాం వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులు, దాడి జరిగిన క్రమాన్ని నిర్ధారించేందుకు సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
