ఢిల్లీలో కూలిన భవనం.. శిథిలాల కింద సుమారు చాలా మంది విద్యార్థులు!
దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భవనంలో విద్యార్థుల కోసం PG వసతి కొనసాగుతున్నట్లు సమాచారం ఉండటంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న ఆందోళన నెలకొంది. NDRF, ఢిల్లీ పోలీసులు, విపత్తు నిర్వహణ సంస్థ, MCD బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌లో భయానక పరిస్థితి నెలకొంది. నాలుగు అంతస్తుల భవనం క్షణాల్లో కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం నేలమట్టం కావడంతో.. ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ, ఢిల్లీ పోలీస్, ఎంసీడీ బృందాలు సంయుక్తంగా రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న మరో నివాస భవనాన్ని కూడా అధికారులు ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా, గాయపడిన మరొకరిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. గురుగ్రామ్ నివాసి అయిన భవన యజమాని ఆనంద్ బన్సల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలోని ప్రాంతం కావడంతో.. ఈ బిల్డింగ్‌లో పేయింగ్ గెస్ట్ వసతి కొనసాగుతున్నట్లు సమాచారం. అంటే.. విద్యార్థులే ఎక్కువగా ఉంటున్న భవనం..! ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 20 మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో శిథిలాల కింద ఇంకెంత మంది చిక్కుకుని ఉంటారన్న ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటికే పలువురిని సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగుతోంది.
#WATCH | Drone visuals from the building collapse site in Satya Niketan of Delhi’s South-West district. Rescue operations ongoing.
Delhi Police said, “From the local enquiry, it came to our knowledge that this was a 40–50-year-old building, comprising a basement and five upper… pic.twitter.com/HLP8qedFRl
— ANI (@ANI) September 6, 2026
ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఒక భవనం కూలిపోయిన తర్వాత.. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన గురించి అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
నెలముందే.. నోటీసులు..
ఈ భవనంలో ప్రతి ఫ్లోర్‌లో 4 గదులున్నాయి.. ఒక్క గదిలో రెండు బెడ్లు ఏర్పాటు చేసి.. ఒక బెడ్‌కు రూ.18 వేల అద్దె వసూలు చేస్తున్నారు. అయితే.. ఈ భవనం బలహీనంగా ఉందని నెల రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మరి ఆ నోటీసుల తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు..? భవనాన్ని ఖాళీ చేయించారా..? లేక ప్రమాదం జరిగే వరకు అధికారులు చూస్తూ ఊరుకున్నారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
#WATCH | Delhi’s Satya Niketan building collapse: A local resident says, “This is the second such incident in the area, with a building having collapsed earlier as well. There is a limit of only two or three floors, but these people had constructed five floors. It was illegal… pic.twitter.com/ws0CtrkBPK
— ANI (@ANI) September 6, 2026
భవనం కూలిన ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సమీపంలోని మరో భవనాన్ని ముందస్తు జాగ్రత్తగా ఖాళీ చేయించినట్లు వెల్లడించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు.
