AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు చనిపోయాడనీ అంత్యక్రియలు.. నెల రోజుల తర్వాత ఊహించని ఫోన్ కాల్! దెబ్బకు అంతా షాక్

కన్న కొడుకు కనిపించకపోవడంతో అతడు ఇక లేడని భావించి కుటుంబం ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే నెల రోజుల తర్వాత అనూహ్యంగా ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ కుమారుడు బతికే ఉన్నాడని, ప్రస్తుతం జైలులో ఉన్నాడని తెలిసింది. దీంతో దుఃఖంలో మునిగిపోయిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. అయితే తాము అంత్యక్రియలు నిర్వహించింది ఎవరికి? అనే ప్రశ్న ఇప్పుడు మిస్టరీగా మారింది. పంజాబ్‌లోని కపుర్తలాలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది..

కొడుకు చనిపోయాడనీ అంత్యక్రియలు.. నెల రోజుల తర్వాత ఊహించని ఫోన్ కాల్! దెబ్బకు అంతా షాక్
After Cremation Punjab Family Gets A Call
Srilakshmi C
|

Updated on: Sep 06, 2026 | 11:40 AM

Share

కపుర్తలా, సెప్టెంబర్ 6: పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన రవి కుమార్ అనే యువకుడు ఆగస్టు 5న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఎన్ని రోజులు వెదికినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రవి తండ్రి, సోదరుడు అతడి కోసం బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు. వివిధ ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీంతో చివరకు ఆగస్టు 11న కపుర్తలా సిటీ పోలీస్ స్టేషన్‌లో రవి కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే పోలీసులకు ఓ యువకుడి మృతదేహం లభించింది. అయితే ఆ మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తించడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని పోలీసులు రవి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహానికి సంబంధించిన ఫొటోలను కుటుంబ సభ్యులకు చూపించారు. ఫొటోలను పరిశీలించిన కుటుంబ సభ్యులు, బంధువులు.. ఆ మృతదేహం రవిదేనని భావించారు.

నెల రోజుల తర్వాత ఊహించని ఫోన్ కాల్

తమ కుమారుడు ఇక లేడని భావించిన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎంతో ఆశగా తమ కుమారుడు తిరిగి వస్తాడని ఎదురుచూసిన కుటుంబానికి ఈ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చివరకు ఆగస్టు 13న ఆ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కన్న కొడుకు ఇక తమ మధ్య లేడని భావిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. అంత్యక్రియలు పూర్తయ్యాక కూడా కుటుంబం విషాదంలోనే ఉంది. అయితే ఈ విషాద కథలో ఊహించని మలుపు సెప్టెంబర్ 2న చోటుచేసుకుంది. కపుర్తలా సెంట్రల్ జైలు నుంచి రవి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ‘మీ కుమారుడు రవి కుమార్ జైలులో ఉన్నాడు. వచ్చి కలవండి’ అని జైలు సిబ్బంది సమాచారం అందించారు. ఈ మాటలు విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ‘రవి చనిపోయాడు కదా.. మరి జైలులో ఎలా ఉన్నాడు? అంటూ కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు.

అసలేం జరిగిందంటే..

రవి కుమార్‌ను సుమారు నెల రోజుల క్రితమే జలంధర్ పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడనే కేసులో అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు తెలిసింది. అయితే ఈ విషయం అతడి కుటుంబ సభ్యులకు తెలియలేదు. అదే సమయంలో పోలీసులు చూపించిన ఫొటోలను చూసి కుటుంబ సభ్యులు ఓ మృతదేహాన్ని రవిగా భావించారు. దీంతో తమ కుమారుడు చనిపోయాడని భావించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. జైలు నుంచి వచ్చిన ఫోన్‌తో అసలు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మరుసటి రోజు, సెప్టెంబర్ 3న కపుర్తలా సెంట్రల్ జైలుకు వెళ్లారు. అక్కడ తమ కళ్ల ముందే రవిని బతికే ఉండటాన్ని చూసి వారు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఇక తమ కుమారుడు లేడని భావించిన కుటుంబానికి.. అతడు తమ ముందే సజీవంగా కనిపించడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కొద్దిరోజుల క్రితం వరకు కొడుకు మరణించాడని కన్నీళ్లు పెట్టుకున్న కుటుంబం.. ఇప్పుడు అతడు బతికే ఉన్నాడని తెలిసి ఆనందభాష్పాలు పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

అంత్యక్రియలు నిర్వహించింది ఎవరికి?

అయితే ఈ ఘటనలో ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న తలెత్తింది. ఆ కుటుంబం ఆగస్టు 13న అంత్యక్రియలు నిర్వహించింది ఎవరికి? పోలీసులు చూపించిన ఫొటోలను చూసి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రవిదేనని గుర్తించినప్పటికీ.. అసలు ఆ మృతదేహం ఎవరిది అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఒకవైపు తమ కుమారుడు బతికే ఉన్నాడనే ఆనందం.. మరోవైపు తాము అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి ఎవరనే అయోమయం.. ఈ రెండింటి మధ్య ఆ కుటుంబం ప్రస్తుతం తీవ్ర గందరగోళంలో ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతదేహం గుర్తింపులో ఎలా పొరపాటు జరిగింది? కుటుంబ సభ్యులు చూసిన ఫొటోల్లో అసలు ఏం కనిపించింది? ఆ మృతదేహం ఎవరిది? అనే అంశాలపై ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us