Gold Rates: ఏకంగా రూ.3 వేలకుపైగా తగ్గిన బంగారం.. కొనుగోలు చేసేవారికి జాక్‌పాట్..
బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత వారంలో కూడా డౌన్ అయ్యాయి. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, డాలర్ బలపడటం ధరలు తగ్గుదలకు కారణమవుతున్నాయి. గత రెండు వారాలుగా ధరలు తగ్గుతూనే ఉన్నాయి.

గత వారంలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతకముందు వారం కూడా పడిపోగా.. గత వారం కూడా మరోసారి డౌన్ అయ్యాయి. దీంతో గోల్డ్ ప్రియులకు గత రెండు వారాలుగా ధరలు ఊరట కల్పిస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు గత వారంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. వారం ప్రారంభంలో పతనమవ్వగా.. మధ్యలో కాస్త పుంజుకున్నాయి. వారం చివరినాటికి మళ్లీ కుప్పకూలాయి. గత వారంలో బంగారం ధరలు ఎంత తగ్గాయనేది చూద్దాం.
3 వేలకుపైగా తగ్గిన బంగారం ధర
గత వారం బంగారం ధర ఏకంగా రూ.3440 మేర తగ్గింది. ఆగస్ట్ 30న ఆదివారం దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,240 వద్ద ప్రారంభమైంది. సెప్టెంబర్ 6 ఆదివారం నాటికి ఆ ధర రూ.1,54,800కి చేరుకుంది. మొత్తం రూ.3440 పతనమైంది. ఇక 22 క్యారెట్ల ధర ఆగస్ట్ 30న రూ.1,45,050 వద్ద ఉండగా.. సెప్టెంబర్ 6 నాటికి రూ.1,41,900కి చేరుకుంది. మొత్తం వారంలో రూ.3150 తగ్గింది.
గత వారంలో వెండి ధరలు చూస్తే..
వెండి ధరలు స్దిరంగా కొనసాగుతున్నాయి. ఆగస్ట్ 30న ఆదివారం కిలో వెడి ధర దేశీయ బులియన్ మార్కెట్లో రూ.2.50 లక్షల వద్ద ప్రారంభమైంది. ఆగస్ట్ 6 నాటికి కిలో వెండి రూ.2,54,900 వద్దకు చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో రూ.2.50 లక్షలకు లభిస్తున్నాయి. దీంతో సిల్వర్ ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదని చెప్పుకోవాలి.
ధరలు తగ్గుదలకు కారణాలు
అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ గత వారంలో ఔన్సుకు సుమారు 4,433 డాలర్ల వద్ద ప్రారంభించింది. అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ బలపడటంతో ఒత్తిడి పెరిగింది. సెప్టెంబర్ 4 నాటికి, స్పాట్ గోల్డ్ ఔన్సుకు సుమారు 4,419 డాలర్లకు చేరుకుంది. సెప్టెంబర్ 6 నాటికి 4419 డాలర్ల వద్ద ఉంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రతరం కావడం, వారం మధ్యలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలలో ఆకస్మిక మార్పు చోటుచేసుకోవడం, శుక్రవారం అమెరికా ఆగస్టు ఉద్యోగాల నివేదిక వెలువడటంతో ఒక్క సెషన్‌లోనే సానుకూల వైఖరిని చాలా వరకు తిప్పికొట్టడంతో కమోడిటీ మార్కెట్లు గత కొన్ని నెలల్లోనే అత్యంత అస్థిరమైన వారాన్ని చవిచూశాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య పోరాటం తీవ్రతరం కావడంతో.. విలువైన లోహాలు మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరడం, భారీ అమ్మకాలు, బలమైన పునరుద్ధరణ, ఆపై శుక్రవారం వెనక్కి తగ్గడం వంటి పూర్తి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.
