PM Modi: నా నరాల్లో రక్తం కాదు.. సిందూరం మరుగుతోంది.. మనల్ని ఏ శక్తీ ఆపలేదు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై మరోసారి తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు. ఏప్రిల్ 22న జరిగిన దాడికి జవాబు కేవలం 22 నిమిషాల్లోనే ఇచ్చామన్నారు. 9 పెద్ద ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని.. మన ఆడబిడ్డల సింధూరం తుడిచేస్తే ఏం జరుగుతుందో మన శత్రువులతో పాటు ప్రపంచానికి కూడా తెలిసొచ్చిందన్నారు.

PM Modi: నా నరాల్లో రక్తం కాదు.. సిందూరం మరుగుతోంది.. మనల్ని ఏ శక్తీ ఆపలేదు
Pm Modi

Updated on: May 22, 2025 | 4:44 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై మరోసారి తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు. ఏప్రిల్ 22న జరిగిన దాడికి జవాబు కేవలం 22 నిమిషాల్లోనే ఇచ్చామన్నారు. 9 పెద్ద ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని.. మన ఆడబిడ్డల సింధూరం తుడిచేస్తే ఏం జరుగుతుందో మన శత్రువులతో పాటు ప్రపంచానికి కూడా తెలిసొచ్చిందన్నారు. మన మహిళల సింధూరం తుడిచేందుకు వచ్చిన వాళ్లను మట్టిలో కలిపేశామన్నారు మోదీ. భారత్ మౌనంగా ఉంటుందనుకున్న వాళ్లు ఇప్పుడు భయపడుతున్నారన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్విస్తున్నారని ప్రధాని మోదీ.. రాజస్థాన్‌లోని బికనేర్‌లో జరిగిన బహిరంగ సభలో పేర్కొన్నారు.

భారత్‌ది కేవలం ఆక్రోశం మాత్రమే కాదన్నారు ప్రధాని మోదీ. ఇది సమర్థ భారత్ రౌద్ర రూపమని.. ఇదే నవ భారతమని తెలిపారు. పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు ఉండవన్నారు మోదీ. ఒకవేళ చర్చలు జరిగితే కేవలం పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) మీదే జరుగుతాయని స్పష్టం చేశారు. పాక్‌కు చుక్క నీటిని కూడా వదిలేదిలేదన్నారు. ప్రపంచంలోని ఏ శక్తి ఈ విషయంలో మనల్ని ఆపలేదని స్పష్టం చేశారు.

వీడియో చూడండి..

‘‘నా నరాల్లో రక్తం కాదు, సిందూరం మరుగుతోంది’’ అని మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యంగా ఉంది. పహల్గామ్ దాడి తూటాలు 140 కోట్ల మంది భారతీయుల గుండెల్లో గుచ్చుకున్నాయని.. ఈ ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోయిందని మోదీ పేర్కొన్నారు. త్రివిధదళాలకు తమ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. సమర్ధవంతంగా త్రివిధదళాలు పాక్‌ను చావుదెబ్బ కొట్టాయని మోదీ పేర్కొన్నారు. సాయుధ దళాలకు ఇచ్చిన స్వేచ్ఛా హస్తం ఫలితంగా పాకిస్తాన్ మోకరిల్లిందని మోదీ పేర్కొన్నారు.

తన మైండ్ కూల్ గా ఉన్నా.. రక్తం మరుగుతూ ఉంటుందని.. ఈ విషయాన్ని పాక్ మరిచిపోవద్దని హెచ్చరించారు. భారతదేశం ఉగ్రవాద దాడి జరిగితే.. ప్రతీకారం బలంగా తీర్చుకుంటామని.. వదిలిపెట్టమని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..