మంచు దుప్పటి కప్పేసిన సిమ్లా.. ప్రకృతి అందాలను అస్వాదించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
సిమ్లా ప్రాంతం మొత్తం తెల్లటి మంచుతో తివాచీ పరుచుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మంచును తెగ ఎంజాయ్ చేశారు.
Bandaru Dattatreya in snowfall : గత కొద్ది రోజులుగా కురుస్తున్న మంచు వర్షంలో భూతల స్వర్గం జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. మంచు తుఫాన్‌తో మరింత అందంగా కనిపిస్తోంది. హిమపాతం స్థానికుల్లో కొంత ఇబ్బంది కలిగించినా.. చాలా ఆహ్లాదంగా ఉండటంతో వాతావరణాన్ని వారు అస్వాదిస్తున్నారు.
అటు సిమ్లా ప్రాంతం భారీ మంచు దుప్పటి కప్పేసింది. దీంతో స్థానిక ప్రజలకు ఉత్సాహాన్నిచ్చింది. పర్వత ప్రాంతం మొత్తం తెల్లటి మంచుతో తివాచీ పరుచుకుంది. దీంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మంచును తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గురువారం, గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రయ రాజ్ భవన్ కాంప్లెక్స్ సందర్శించి మంచు రేకులు ఆనందించారు. ఈ చిరస్మరణీయ క్షణాలను రాజ్ భవన్ సిబ్బందితో గడిపినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
హిమపాతం ప్రకృతి ఇచ్చిన వరంగా కొనియాడిన గవర్నర్.. ఇది కచ్చితంగా సానుకూల శక్తిని ఇస్తుందని అన్నారు. ఈ సీజన్‌లో హిమపాతం పండ్ల తోటలకు ఎరువుగా ఉపయోగపడుతుందని, రాబోయే కాలంలో మంచి దిగుబడికి ఇది సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంచు కారణంగా ప్రజలు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ దత్తాత్రేయ అధికారులను ఆదేశించారు.
మరోవైపు, గత 24 గంటలుగా కురుస్తోన్న మంచుతో జనజీవనం కొంత స్తంభించింది. ప్రధాన జాతీయ రహదారులపై 3 అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. మరో రెండు రోజులపాటు హైవేపై ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Read Also.. నిరసనలతో హోరెత్తిన పార్లమెంట్.. పట్టు వీడని విపక్షాలు.. పలుమార్లు లోక్‌సభ వాయిదా