నిరసనలతో హోరెత్తిన పార్లమెంట్.. పట్టు వీడని విపక్షాలు.. పలుమార్లు లోక్‌సభ వాయిదా
గురువారం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మళ్లీ సాగు చట్టాలపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

loksabha proceedings adjourned : పార్లమెంట్ సమావేశాలు వరుసగా మూడో రోజు వ్యవసాయ చట్టాలపై రగడ కొనసాగింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య మరోసారి లోక్‌సభ వాయిదా పడింది. గురువారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మళ్లీ సాగు చట్టాలపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పలుమార్లు వారించినా విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో సభ రేపటికి వాయిదా పడింది.
గురువారం ఉదయం నుంచి వాయిదా పడుతూ వచ్చిన లోక్‌సభ.. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకువచ్చి ప్లకార్డులతో నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనల నడుమ స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. ఓవైపు ఎంపీలు నినాదాలు చేస్తున్నా.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రెండు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దీంతో సభను సజావుగా సాగనివ్వాలని స్పీకర్ పదేపదే సభ్యులను కోరారు. అయినప్పటికీ సభ్యులు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో సభను మరోసారి 45 నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్.
అనంతరం తిరిగి 5 గంటలకు సభ ప్రారంభమైనా.. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన ఆపలేదు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. వారి ఆందోళన నడుమే స్పీకర్ ప్రశ్నోత్తరాల గంటను కొనసాగించారు. దీంతో విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభ మళ్లీ వాయిదా పడింది. నిరసనల మధ్య మధ్యవర్తిత్వ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇక ఎంతటికీ సభ్యులు నిరసన విరమించకపోవడంతో సభను మరోసారి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Read Also.. మరోసారి కీలక నిర్ణయం తీసుకున్న సౌదీ ఆరేబియా.. భారత్ సహా 20 దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం




